న్యూఢిల్లీ: భారత్‌లో స్థానికంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (బీఈవీ), బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ తెలిపారు. ఇందుకోసం 2025 నాటికి రూ.10,445 కోట్ల మేర (150 బిలియన్ జపాన్ యెన్‌లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో ఎస్‌ఎంసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఇండియా–జపాన్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో దీనిపై సంతకాలు చేసినట్లు ఎస్‌ఎంసీ వివరించింది. ఈ ఎంవోయూ కింద ప్రస్తుతం ఎస్‌ఎంసీకి ఉన్న ప్లాంటుకు పక్కన బీఈవీ బ్యాటరీల తయారీ కోసం కొత్తగా ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. దీనికోసం రూ. 7,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. అలాగే బీఈవీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 2025 నాటికి మరో రూ. 3,100 కోట్లు ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్ చేయనుంది.
ప్రస్తుతం ప్రధాన అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ద్వారా సుజుకీ గ్రూప్‌నకు హర్యానాలో రెండు ప్లాంట్లు, సొంతంగా గుజరాత్‌లో ఒక ప్లాంటు ఉంది. హర్యానాలో ప్లాంట్లలో ఏటా 15 లక్షల సాంప్రదాయ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) వాహనాలను తయారు చేస్తోంది. ఇక మారుతికి మాత్రమే వాహనాలను సరఫరా చేసే ఎంఎంసీ సొంత ప్లాంటు సామర్థ్యం ఏటా 7.5 లక్షల యూనిట్లుగా ఉంది. మరోవైపు, గ్రూప్‌లోని మరో సంస్థ మారుతి సుజుకీ టొయుత్సు ఇండియా (ఎంఎస్‌టీఐ) సారథ్యంలోని వాహనాల రీసైక్లింగ్ ప్లాంటుపై 2025 నాటికి రూ. 45 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్‌ఎంసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment