న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది.
భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది.
మెజారిటీ వాటా విక్రయం..
వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్‌కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది.
లక్ష మంది విద్యార్థులు..
ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్‌ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్‌ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను ఆవిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment