హోండా కార్ల రేట్ల పెంపు
రూ. 90వేల దాకా పెరుగుదల
న్యూఢిల్లీ: జీఎస్‌టీ సెస్సు పెరిగిన నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థ హోండా కార్స్ ఇండియా తమ కార్ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. సిటీ, బీఆర్–వీ, సీఆర్–వీ మోడల్స్‌పై ఈ పెరుగదల రూ. 7,003 నుంచి రూ. 89,069 దాకా ఉందని వివరించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఎస్‌యూవీ బీఆర్–వీ ధరపై పెరుగుదల రూ. 12,490–రూ. 18,242 శ్రేణిలో ఉంది. అలాగే ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్–వీ రేటు పెంపు రూ. 75,304–రూ. 89,069 మధ్యలో ఉంది.
మధ్య స్థాయి సెడాన్ సిటీ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 7,003 నుంచి రూ. 18,791 దాకా పెరిగింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన కార్ల మోడల్స్‌పై రేట్లను రూ. 13,000 నుంచి రూ. 1.6 లక్షల దాకా పెంచిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీ కౌన్సిల్ ఇటీవలే మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సును 2–7 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే కార్ల తయారీ సంస్థలు కూడా రేట్లు పెంచుతున్నాయి.