న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా భారత మార్కెట్లో ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి సారించి ఏటా ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్స్‌లో రూ.10 లక్షలు, ఆపై ధరలో వీటిని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుమురా తెలిపారు. ‘ప్యాసింజర్ వాహన రంగంలో 40 శాతం వాటా రూ.10 లక్షల పైచిలుకు మోడళ్లదే. ఈ విభాగం వాటా మరింత పెరగనుంది. అమేజ్, సిటీ మోడళ్ల టాప్ ట్రిమ్స్ 60 శాతం పైగా వాటా కైవసం చేసుకున్నాయి. విదేశాల్లో విక్రయిస్తున్న మోడళ్లను సైతం ఇక్కడ ప్రవేశపెడతాం. రూ.260 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా సేల్స్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని వివరించారు.
వృద్ధిపై దృష్టిపెట్టాం.. : అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత మోడళ్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని సుమురా చెప్పారు. ‘ఈ ప్రణాళికలో భారత్ కూడా ఉంది. అయితే మౌలిక వసతులనుబట్టి ఒక్కో మార్కెట్ ఒక్కోలా ఉంటుంది. అంతర్జాతీయ పోకడలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లో డీజిల్ మోడళ్లను నిలివేశాం. చిప్ కొరత ప్రభావం ఇప్పటికీ కంపెనీపై ఉంది. రాజస్థాన్ ప్లాంటులో ఏటా 1.3 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. కొత్త మోడళ్ల రాకతో ప్లాంటు వినియోగం పెరుగుతుంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా 1.8 లక్షల యూనిట్లు. దీనిని 2.2 లక్షల యూనిట్లకు విస్తరించవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలతో రెండేళ్లుగా భారత్‌లో లాభాలు గడిస్తున్నాం. ఈ ఏడాది రానున్న ఎస్‌యూవీతో అమ్మకాలు అధికం అవుతాయి’ అని తెలిపారు.
కొత్త వెర్షన్స్‌లో సిటీ..
సిటీ కొత్త వెర్షన్స్‌ను కంపెనీ గురువారం ప్రవేశపెట్టింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇది తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం. మైలేజీ వర్షన్‌నుబట్టి లీటరుకు 17.8–18.4 కిలోమీటర్లు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్ (ఈహెచ్‌ఈవీ) ధర రూ.18.89 లక్షల నుంచి మొదలు. మైలేజీ లీటరుకు 27.13 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. రానున్న రోజుల్లో సిటీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఈహెచ్‌ఈవీ నుంచి ఉంటుందని హోండా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment