excise duty reduction
-
లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై సుంకాలతో పాటు ప్లాస్టిక్, స్టీల్ మొదలైన వాటికి సంబంధించిన ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు దిగివచ్చేందుకు వీలవుతుం దని ఎగుమతిదారులు తెలిపారు. తయారీలో పోటీతత్వం మెరుగుపడేందుకు, విలువను జోడించిన ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడగలదని పేర్కొన్నారు. అలాగే దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గగల దని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేష న్స్ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎ. శక్తివేల్ తెలిపారు. టెక్స్టైల్స్ ముడి వనరుల విషయంలోనూ ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్తి ఎగుమతులపై సుంకాలు విధించి, కాటన్ యార్న్ దిగుమతులపై సుంకాలు ఎత్తివేస్తే దేశీ పరిశ్రమలకు సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నా రు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఉక్కు, ప్లాస్టిక్ ముడి సరుకులకు సంబంధిం చి దిగుమతి సుంకాలను కూడా తగ్గించిన కేంద్రం.. ముడి ఇనుము, ఉక్కు ఇంటర్మీడియట్స్పై ఎగుమతి సుంకాన్ని పెంచింది. -
ధరల స్పీడ్ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం
ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. క్రిప్టో కరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు. క్రిప్టో మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. -
పెట్రో సెగల నుంచి ఊరట..?
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో ప్రభుత్వం వినియోగదారులకు ఊరట ఇచ్చే చర్యలు చేపడుతుందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ వారంలోనే కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవచ్చని ఆయన సంకేతాలు పంపారు. పెట్రో ధరలు పెరగడం ప్రభుత్వానికి సంక్షోభ పరిస్థితేనని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలతో ముందుకొస్తుందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఎక్సయిజ్ సుంకం కోతతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో ఉండేలా మరికొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఈ వారంలోనే ప్రభుత్వం పెట్రో ధరల నియంత్రణకు పలు చర్యలతో ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను సవరించని చమురు మార్కెటింగ్ సంస్థలు మే 14 నుంచి వరుసగా రోజూ ధరలను పెంచుతుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరిన సంగతి తెలిసిందే. -
పెట్రో ధరలు అంత భారీగా ఏం లేవు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సినంత భారీగా పెట్రో ఉత్పత్తుల ధరలేమీ లేవనీ, కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించడమే లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు. పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గార్గ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ మినహా మిగిలిన అన్ని ఇంధనాలకూ ప్రభుత్వం రాయితీని ఎత్తివేసిందనీ, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే ఎక్సైజ్ సుంకం తగ్గింపు రూపంలో వాటిపై పరోక్ష రాయితీని ఇచ్చే అవకాశం ఉండొచ్చని చెప్పారు. లీటర్ పెట్రోల్/డీజిల్‌పై ఒక రూపాయి ఎక్సైజ్ సుంకం తగ్గించినా ప్రభుత్వానికి రూ. 13 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ. 19.48, లీటర్ డీజిల్‌పై రూ. 15.33ల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం విధిస్తోంది. -
ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్‌లు చేరాయి. టాటా తగ్గింపు లక్షన్నర వరకూ టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది. వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యమహా ఇండియా... కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్‌జడ్16, వైజడ్ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్టీఆర్ బైక్‌లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి.