సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో ప్రభుత్వం వినియోగదారులకు ఊరట ఇచ్చే చర్యలు చేపడుతుందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరుకోవడంతో నెలకొన్న సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ వారంలోనే కొన్ని చర్యలు తీసుకోవచ్చని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకోవచ్చని ఆయన సంకేతాలు పంపారు.
పెట్రో ధరలు పెరగడం ప్రభుత్వానికి సంక్షోభ పరిస్థితేనని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలతో ముందుకొస్తుందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఎక్సయిజ్ సుంకం కోతతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులో ఉండేలా మరికొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.
ఈ వారంలోనే ప్రభుత్వం పెట్రో ధరల నియంత్రణకు పలు చర్యలతో ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రో ధరలను సవరించని చమురు మార్కెటింగ్ సంస్థలు మే 14 నుంచి వరుసగా రోజూ ధరలను పెంచుతుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డుస్ధాయికి చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment