Fiat
-
5 ఆటోమొబైల్ కంపెనీల దెబ్బకి నిరుద్యోగులుగా 64,000 మంది
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో పేర్కొన్నట్లుగా ఎక్కడో జరిగిన ఒక చర్య వల్ల ప్రస్తుతం జరుగుతున్న పని మీద ప్రభావం పడుతుంది. అలాగే, జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వెంటనే కాకపోయిన ఆ తర్వాత ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఐదేళ్లలో భారతదేశం విడిచివెళ్లిపోతున్న సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. దేశం విడిచిపోతున్న విదేశీ ఆటో మొబైల్ కంపెనీల వల్ల సుమారు 64,00 మంది ఉద్యోగం కోల్పోయినట్లు, రూ.2,485 కోట్ల నష్టం డీలర్లకు వాటిల్లినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్(ఎఫ్ఎడీఎ) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పంచుకున్న డేటాలో వెల్లడించింది. ఆరు ప్రధాన ఆటోమోటివ్ కంపెనీలు బ్రాండ్లు అయిన ఫోర్డ్, జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, ఫీయట్, హార్లే డేవిడ్సన్, యుఎం మోటార్ సైకిల్స్ వంటి అనేక దిగ్గజ విదేశీ వాహన కంపెనీలు 2017 నుంచి భారతదేశంలో అమ్మకాలను నిలిపివేశాయి. ఈ నిర్ణయం వల్ల 464 మందికి పైగా డీలర్లు ప్రభావితం అయ్యారు. ఎఫ్ఎడీఎ అధ్యక్షుడు వింకేష్ గులాటి మాట్లాడుతూ.. "ఈ ఎంఎన్సీల ఆకస్మికంగా వెళ్ళిపోవడం మొత్తం ఆటో రిటైల్ పరిశ్రమకు చాలా బాధను కలిగిస్తాయి. వినియోగదారుల నుంచి సరైన మద్దతు లేకుండా వ్యాపారం చేయడం కష్టం. కానీ, దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయం భారీ పెట్టుబడులతో ఈ రంగంలోనికి ప్రవేశించాలి అనుకునే స్టార్టప్ కంపెనీల ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది" అని ఆగస్టులో జరిగిన ఎఫ్ఎడీఎ మూడవ ఆటో రిటైల్ సమావేశానికి హాజరైన భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేను ఉద్దేశించి ప్రస్తావించారు. ఫోర్డ్ ఇండియా అనేక సంవత్సరాలుగా నిలుదొక్కుకునేందుకు ప్రయత్నించిన తర్వాత ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న నిష్క్రమించింది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో స్వంత ఉద్యోగులలో 4,000 మందికి పైగా రెండు తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్నారు. ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం వల్ల వారు నిరుద్యోగులుగా మారనున్నారు. భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ డిమాండ్ చేసింది. ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రాకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. (చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!) -
అమ్మకానికి కస్టమర్ల డేటా!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ తన వినియోగదారుల సమాచారాన్ని విక్రయించాలని 2012లో అనుకుందని ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఫేస్‌బుక్‌కు చెందిన గ్రాఫ్ ఏపీఐలో వినియోగదారుల సమాచారం భారీస్థాయిలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏపీఐలోని వివరాలు/సమాచారాన్ని పొందేందుకు కంపెనీల నుంచి కనీసం రెండున్నర లక్షల డాలర్లు వసూల చేయాలని ఫేస్బుక్ 2012లో భావించిందని అర్స్‌టెక్నికా అనే సంస్థ బయటపెట్టింది. 2014లో ఫేస్బుక్ ఆ నిర్ణయానికి కొన్ని మార్పులు చేసిందనీ, 2015 నాటికి గ్రాఫ్ ఏపీఐలోని కొద్ది సమాచారం మాత్రమే కంపెనీలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేసిందని తెలిపింది. కోర్టుకు చేరిన ఓ పత్రం నుంచి సమాచారాన్ని సేకరించి అర్స్‌టెక్నికా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రాఫ్ ఏపీఐ నుంచి విస్తృత స్థాయిలో సమాచారం పొందేందుకు నిస్సాన్, కెనడా రాయల్ బ్యాంక్, ఎయిర్‌బీఎన్‌బీ, నెట్‌ఫ్లిక్స్, లైఫ్ట్, క్రైస్లర్/ఫియట్ తదితర కంపెనీలు ఉన్నాయని అర్స్‌టెక్నికా తెలిపింది. ఓ కేసులో బ్రిటన్ పార్లమెంటు ఫేస్బుక్ అంతర్గత పత్రాలను పరిశీలన నేపథ్యంలో తాజా వార్త ఫేస్‌బుక్‌కు మరింత ఆందోళన కలిగించనుంది. -
రొనాల్డో ఎఫెక్ట్.. ఫియట్ కంపెనీకి షాక్
రోమ్ : ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను తమ యజమాని(ఆగ్నెల్లీ కుటుంబం- యువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ వాటాదారు) కొనుగోలు చేయడం పట్ల ఫియట్ కార్ల సిబ్బంది యూనియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. యూనియన్ లీడర్ లావోరో ప్రైవాటో మాట్లాడుతూ.. ‘ సంస్థను సమర్థవంతంగా నడిపించడానికి, అభివృద్ధి సాధించడానికి ఏళ్ల తరబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. అయితే ఒక ఆటగాడి కోసం వందల మిలియన్ యూరోలు ఖర్చు చేయడం చూస్తుంటే కార్మికుల త్యాగాలకు విలువ లేదని అర్థమైంది. అందుకే ఎఫ్సీఏ, సీఎన్హెచ్ఐ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారని’ తెలిపారు. రొనాల్డో కోసం వెచ్చించిన డబ్బును ఉద్యోగ కల్పన కోసం ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే... ప్రఖ్యాత కార్ల కంపెనీలు ఫెరారీ, ఫియట్, యువెంటస్ క్లబ్‌లకు మాతృసంస్థ అయిన ఎగ్జార్.. రొనాల్డోను కొనుగోలు చేయడం ద్వారా తమ మార్కెట్ వ్యాల్యూను పెంచుకోవాలని భావిస్తోంది. జీప్ లోగో కలిగి ఉన్న యువెంటస్ క్లబ్ జెర్సీని రొనాల్డో ధరించడం ద్వారా భారీ స్థాయిలో తమకు ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే 10 కోట్ల 50 లక్షల యూరోలు(846 కోట్ల రూపాయలు) వెచ్చించినట్లు తెలిపింది. కాగా గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్(స్పెయిన్) తరపున ఆడుతున్న రొనాల్డోను ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈ రెండు క్లబ్‌ల మధ్య కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం.. యువెంటస్ క్లబ్ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్ మాడ్రిడ్‌కు చెల్లించనుంది. అలాగే నాలుగేళ్ల పాటు యువెంటస్ తరపున ఆడనున్నందుకు గానూ రొనాల్డోకు సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున వేతనంగా లభిస్తాయని సమాచారం. -
భారత్‌కు జీప్ బ్రాండ్..
♦ ఆగస్టులో రెండు మోడళ్లతో ఎంట్రీ ♦ ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ వాహన రంగంలోకి మరో అమెరికన్ బ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్‌కు చెందిన ‘జీప్’ సొంతంగా ఇక్కడి మార్కెట్లో ఆగ స్టులో ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో జీప్ బ్రాండ్ వాహనాలను మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసి విక్రయించేది. జీప్ ముందుగా భారత్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఇవి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లను పూర్తిగా తయారు చేసి భారత్‌కు దిగుమతి చేయనున్నారు. 2017 రెండో త్రైమాసికం నుంచి పూర్తిగా దేశీయంగా తయారీ చేపడతామని జీప్ బ్రాండ్ గ్లోబల్ హెడ్ మైఖేల్ మాన్లే వెల్లడించారు. అలాగే భారత్ నుంచి సమీపంలోని విదేశీ మార్కెట్లకు వాహనాలను ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. ధర రూ.40-80 లక్షలు.. అసలైన ఎస్‌యూవీలకు జీప్ బ్రాండ్ పెట్టింది పేరు. పేరు మాదిరిగానే వీటి ధర కూడా అదిరిపోనుంది. ర్యాంగ్లర్ ధర రూ.40-50 లక్షలు, గ్రాండ్ చెరోకీ ధర రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. మూడు, అయిదు డోర్ల వేరియంట్లో ర్యాంగ్లర్ రానుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్న గ్రాండ్ చెరోకీ 3.0 లీటర్ సీఆర్డీ టర్బో వీ6 డీజిల్ ఇంజన్‌ను పొందుపరిచారు. మైలేజీ 12.8 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. గ్రాండ్ చెరోకీ లిమిటెడ్, సమ్మిట్, ఎస్ఆర్టీ వేరియంట్లలో లభిస్తుంది. 6.4 లీటర్ వీ8 ఇంజన్‌ను ఎస్‌ఆర్‌టీకి జతచేశారు. ఫోర్ వీల్ డ్రైవ్ ఈ ఎస్‌యూవీల ప్రత్యేకత. కంపెనీ దశలవారీగా ఇతర మోడళ్లను భారత్‌కు తీసుకు రానుంది. హైదరాబాద్‌లో జీప్.. తొలుత దేశవ్యాప్తంగా అయిదు మెట్రో నగరాల్లో జీప్ ఎక్స్‌క్లూజివ్ షోరూంలు రానున్నాయి. వీటిలో హైదరాబాద్ షోరూంను లక్ష్మీ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. డిసెంబరుకల్లా ఔట్‌లెట్‌ను సిద్ధం చేస్తామని లక్ష్మీ గ్రూప్ ఎండీ కంభంపాటి జైరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక జీప్ బ్రాండ్ వాహనాలకు భారత్‌లోనూ క్రేజ్ ఎక్కువే. యూఎస్ నుంచి వీటిని దిగుమతి చేసుకుని షికారు చేసే వారూ ఉన్నారు. యూఎస్ ఆర్మీ విరివిగా జీప్ వాహనాలను ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఇవి తమ సత్తా చాటాయి కూడా. జీప్ బ్రాండ్ లెసైన్సును పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా భారత్‌లో పెద్ద ఎత్తున వాహనాలను విక్రయించింది. -
ఫియట్ నుంచి డ్రైవ్ కూల్ క్యాంప్
హైదరాబాద్: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా కంపెనీ డ్రైవ్ కూల్ కాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. దక్షిణ భారత దేశంలో అన్ని ఫియట్ డీలర్‌షిప్‌ల వద్ద ఈ డ్రైవ్ కూల్ కాంప్ ఈ నెల 11న ప్రారంభమైందని, ఈ నెల16న ముగుస్తుందని ఫియల్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల పాటు జరిగే ఈ కాంపెయిన్లో ఫియట్ కార్ల యజమానులు పలు ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ కెవిన్ ఫ్లెన్ పేర్కొన్నారు. కార్ల ఏసీలను ఉత్తమ స్థాయిలో రిపేర్ చేసిస్తామని, వాహన విడిభాగాలపై ప్రత్యేక డిస్కౌంట్లనిస్తామని, కార్ చెకప్ ఉచితమని, మెకానికల్ రిపేర్లకు సంబంధించిన లేబర్ చార్జీల్లో 10 శాతం డిస్కౌంట్నిస్తామని వివరించారు. -
ధరల తగ్గింపు బాటలో మరిన్ని వాహన కంపెనీలు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ కోత తగ్గింపు కారణంగా పలు వాహన కంపెనీల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, వీఈ కమర్షియల్ వెహికల్స్, యమహా, టీవీఎస్‌లు చేరాయి. టాటా తగ్గింపు లక్షన్నర వరకూ టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను రూ. 1.5 లక్ష వరకూ తగ్గించింది. తమ ప్రయాణికుల వాహనాల ధరలను రూ.6,300-రూ.69,000 వరకూ తగ్గించామని, అలాగే వాణిజ్య వాహనాల ధరలను రూ.15,000-రూ.1,50,000 వరకూ తగ్గించామని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులందించడానికి ఈ ధరలు తగ్గించామని వివరించింది. ఈ తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోర్డ్ కోత రూ.1.07 లక్షల వరకూ తమ వాహనాలపై రూ. 23,399 నుంచి రూ.1.07 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నామని ఫోర్డ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఫోర్ట్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించింది. వీఈ కమర్షియల్..: ఐషర్ ట్రక్కులు, బస్సులపై ధరలను తగ్గిస్తున్నామని వీఈ కమర్షియల్ వెహికల్స్ పేర్కొంది. 4 శాతం ఎక్సైజ్ సుంకం పూర్తి తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని, ఈ తగ్గింపు ఈ నెల 18 (మంగళవారం) నుంచే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. యమహా ఇండియా... కంపెనీ టూవీలర్స్ ధరలను రూ.1, 033 నుంచి రూ. 3,066 వరకూ తగ్గించింది. ఎక్సైజ్ సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ శుక్రవారం తెలిపారు. ఈ కంపెనీ ఆల్ఫా, రే జడ్, రే స్కూటర్లను, వైబీఆర్ 110, ఎఫ్‌జడ్16, వైజడ్ఎఫ్ ఆర్15 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. టీవీఎస్ తగ్గింపు రూ.3,500 వరకూ ఎక్సైజ్ సుంకం తగ్గింపును పూర్తిగా వినియోగదారులకే అందిస్తున్నామని, తమ టూవీలర్లు, త్రీ వీలర్ల ధరలను రూ.850 నుంచి రూ.3,500 వరకూ తగ్గిస్తున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్) జె. శ్రీనివాసన్ తెలిపారు. డీలర్ల దగ్గర ప్రస్తుతమున్న స్టాక్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివరించారు. ఈ కంపెనీ స్టార్ సిటీ, అపాచీ ఆర్టీఆర్ బైక్‌లతో పాటు జూపిటర్, వెగో స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా మారుతీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, ఫియట్, మెర్సిడెస్, ఆడి, హీరో, హోండా మోటార్ సైకిల్ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయి.