భారత్కు జీప్ బ్రాండ్..
♦ ఆగస్టులో రెండు మోడళ్లతో ఎంట్రీ
♦ ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ వాహన రంగంలోకి మరో అమెరికన్ బ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్‌కు చెందిన ‘జీప్’ సొంతంగా ఇక్కడి మార్కెట్లో ఆగ స్టులో ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో జీప్ బ్రాండ్ వాహనాలను మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసి విక్రయించేది. జీప్ ముందుగా భారత్‌లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఇవి ప్రీమియం ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లను పూర్తిగా తయారు చేసి భారత్‌కు దిగుమతి చేయనున్నారు. 2017 రెండో త్రైమాసికం నుంచి పూర్తిగా దేశీయంగా తయారీ చేపడతామని జీప్ బ్రాండ్ గ్లోబల్ హెడ్ మైఖేల్ మాన్లే వెల్లడించారు. అలాగే భారత్ నుంచి సమీపంలోని విదేశీ మార్కెట్లకు వాహనాలను ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు.
ధర రూ.40-80 లక్షలు..
అసలైన ఎస్‌యూవీలకు జీప్ బ్రాండ్ పెట్టింది పేరు. పేరు మాదిరిగానే వీటి ధర కూడా అదిరిపోనుంది. ర్యాంగ్లర్ ధర రూ.40-50 లక్షలు, గ్రాండ్ చెరోకీ ధర రూ.80 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. మూడు, అయిదు డోర్ల వేరియంట్లో ర్యాంగ్లర్ రానుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్న గ్రాండ్ చెరోకీ 3.0 లీటర్ సీఆర్‌డీ టర్బో వీ6 డీజిల్ ఇంజన్‌ను పొందుపరిచారు. మైలేజీ 12.8 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. గ్రాండ్ చెరోకీ లిమిటెడ్, సమ్మిట్, ఎస్‌ఆర్‌టీ వేరియంట్లలో లభిస్తుంది. 6.4 లీటర్ వీ8 ఇంజన్‌ను ఎస్‌ఆర్‌టీకి జతచేశారు. ఫోర్ వీల్ డ్రైవ్ ఈ ఎస్‌యూవీల ప్రత్యేకత. కంపెనీ దశలవారీగా ఇతర మోడళ్లను భారత్‌కు తీసుకు రానుంది.
హైదరాబాద్‌లో జీప్..
తొలుత దేశవ్యాప్తంగా అయిదు మెట్రో నగరాల్లో జీప్ ఎక్స్‌క్లూజివ్ షోరూంలు రానున్నాయి. వీటిలో హైదరాబాద్ షోరూంను లక్ష్మీ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. డిసెంబరుకల్లా ఔట్‌లెట్‌ను సిద్ధం చేస్తామని లక్ష్మీ గ్రూప్ ఎండీ కంభంపాటి జైరామ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక జీప్ బ్రాండ్ వాహనాలకు భారత్‌లోనూ క్రేజ్ ఎక్కువే. యూఎస్ నుంచి వీటిని దిగుమతి చేసుకుని షికారు చేసే వారూ ఉన్నారు. యూఎస్ ఆర్మీ విరివిగా జీప్ వాహనాలను ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఇవి తమ సత్తా చాటాయి కూడా. జీప్ బ్రాండ్ లెసైన్సును పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా భారత్‌లో పెద్ద ఎత్తున వాహనాలను విక్రయించింది.