
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10–12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా ఉండే విభాగంలో కొత్త మోడళ్లను అందించలేకపోవడం కూడా విక్రయాలపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరంలో వాహన విక్రయాలు తగ్గుతాయని, ఎన్నికల సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని చరిత్ర చెబుతోందని వివరించారు.
ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు...
డీలర్ల వద్ద నిల్వలను తగ్గించే క్రమంలో భాగం గా ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని భార్గవ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో కొత్త మోడల్‌ను మార్కె ట్లోకి తేనున్నామని, ఫలితంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.