rc bhargava
-
తక్కువ ధరలో కార్లు.. దిగ్గజ కంపెనీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కువమంది ప్రజలు సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇండియా బడ్జెట్ కార్లను తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.మార్కెట్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. దేశ ఆర్థిక స్థితిని తీర్చడానికి.. పౌరులు సురక్షితమైన & సౌకర్యవంతమైన కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో తక్కువ ధరలో చిన్న కార్లను తయారు చేయడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని భార్గవ పేర్కొన్నారు.ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనపరిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో మారుతి సుజుకి విక్రయాలు 2,22,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన కార్లు 2,54,973 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 12.8 శాతం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు భార్గవ పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చేరుకోవడంలో మారుతి సుజుకి గణనీయమైన వృద్ధి సాధించింది. కంపెనీ సర్వీస్ కూడా అద్భుతంగా ఉందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. మా అమ్మకాలు మొత్తంలో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని అన్నారు.మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు. కానీ త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ విభాగంలో కూడా సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ విభాగంలో లాంఛ్ అయ్యే మొదటికారు ఈవీఎక్స్ (eVX) అని తెలుస్తోంది. -
RC Bhargava: భవిష్యత్ భారత్‌దే
న్యూఢిల్లీ: భవిష్యత్ వృద్ధికి సంబంధించి మిగతా దేశాలన్నింటితో పోలిస్తే భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు. భారత్ ముందుకు సాగాలంటే కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలు, విధానాలను వదిలించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు.. వృద్ధి సాధన గురించి ఇథమిత్థంగా అంచనా వేయలేని నిర్దిష్ట స్థాయికి చేరాయని భార్గవ చెప్పారు. అక్కడి ప్రజలు మరింత విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నప్పటికీ పని చేయాలన్న స్ఫూర్తి తగ్గిందని ఆయన తెలిపారు. మరోవైపు, మన వారు తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును కూడా గణనీయంగా మెరుగుపర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. ఇదే కసి భారత్‌ను ముందుకు తీసుకెడుతోందని ఆయన వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదా అనే ప్రశ్నకు స్పందిస్తూ మనం కాలం చెల్లిన విధానాలన్నింటినీ వదిలించుకోవాల్సి ఉందన్నారు. ఇక, తమ సంస్థ ముందు నుంచి పొదుపుగా వ్యవహరిస్తూ వస్తోందని, అందుకే వ్యాపార విస్తరణ కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా అంతర్గత నిధులనే వినియోగించుకుంటున్నామని భార్గవ చెప్పారు. చిన్న పట్టణాల్లో నెక్సా సరీ్వస్ మారుతీ సుజుకీ చిన్న పట్టణాల్లో సరీ్వస్ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇందుకోసం 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కాంపాక్ట్ నెక్సా సరీ్వస్ వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నిర్మల్సహా హర్యానా, పశి్చమ బెంగాల్, గుజరాత్, తమిళనాడులో మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించింది. 2025 మార్చి నాటి కి దేశవ్యాప్తంగా ఇటువంటి 100 వర్క్‌షాప్స్‌ను నెలకొల్పాలన్నది లక్ష్యమని మారుతీ సుజుకీ ఇండి యా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెక్సా షోరూంల ద్వారా జరుగుతున్న మొత్తం కార్ల విక్రయాల్లో నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల వాటా 30 శాతం ఉందని చెప్పారు. -
రాష్ట్రాల్లో అధికారుల తీరు మారటంలేదు..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్ రాజ్)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు. తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు. ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్ రాజ్ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు. -
రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్ ఆర్సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్లు, సీఎన్జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్‌ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు. మార్కెట్ వాటా మళ్లీ పెంచుకుంటాం.. చిన్న కార్లకు డిమాండ్ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్యూవీ సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. 2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్‌ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమోటివ్ రంగానికి పీఎల్ఐ స్కీము పొడిగింపు ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది. దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. -
ప్రైవేట్‌పై నమ్మకమే అభివృద్ధికి దన్ను
గాంధీనగర్: దేశ పురోగతి, అభివృద్ధి సాధనలో ప్రైవేట్ రంగంపై నమ్మకం ఉంచడం కీలకమని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని విశ్వసించిందని, దేశ ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి.. ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో ఉండేలా పరిశ్రమను ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. అలాగని ప్రైవేట్ రంగంలో లోపాలు లేకపోలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వ .. ప్రైవేట్ రంగాల సానుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని చూస్తే ప్రైవేట్ వైపే సానుకూలాంశాల మొగ్గు కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఈ 60–65 ఏళ్లు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను చూసిన మీదట .. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంపై ఆధారపడటం ద్వారా భారత్ ముందుకు వెళ్లగలదు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు‘ అని భార్గవ చెప్పారు. మారుతీ సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, రాబోయే 10–20 ఏళ్లలో దేశీయంగా ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై స్పందిస్తూ భార్గవ ఈ విషయాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు అంత సమర్ధమంతంగా లేకపోవడానికి రాజ్యాంగపరమైన పరిమితులు, లీగల్ విధానాలు, అలాగే నియంత్రణలు.. పర్యవేక్షణ మొదలైన అంశాలు కారణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియను స్వాగతిస్తున్నట్లు భార్గవ చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, దివాలా కోడ్, జీఎస్టీ అమలు, కార్పొరేట్ ట్యాక్స్‌లను తగ్గించడం మొదలైన సంస్కరణలు ప్రశంసనీయమని ఆయన చెప్పారు. ‘కొన్నేళ్ల క్రితం దేశీయంగా పారిశ్రామిక వృద్ధిపై నేను నిరాశావాదంతో ఉన్నాం. బోలెడన్ని మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఏదీ జరిగేది కాదు. కానీ ఒక్కసారిగా సంస్కరణల రాకతో భారత్ మారుతోందని నాకు తోచింది. భవిష్యత్తు ఆశావహంగా ఉండగలదని అనిపించింది‘ అని భార్గవ తెలిపారు. ఈసారి అత్యధిక ఉత్పత్తి.. సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డులు నమోదు చేయగలదని భావిస్తున్నట్లు భార్గవ చెప్పారు. ‘భారత్‌లోను, కార్ల పరిశ్రమలోను 2022–23లో ఉత్పత్తి అత్యధిక స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. నేను కేవలం మారుతీ గురించి మాట్లాడటం లేదు. మొత్తం కార్ల పరిశ్రమ గురించి చెబుతున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. 2018–19లో దేశీయంగా రికార్డు స్థాయిలో 33,77,436 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 30,69,499 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. -
మారుతి సక్సెస్ మంత్ర ఇదే! సీక్రెట్ రివీల్ చేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!) ఇతర రంగాల్లోనూ.. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
బ్రెడ్ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్న కార్లే మారుతీకి బ్రెడ్ అండ్ బటర్‌గా పేర్కొనే పరిస్థితులకు కాలం చెల్లినట్లు మారుతి సూజూకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. బటర్పోగా బ్రెడ్ మాత్రమే మిగిలినట్లు వ్యాఖ్యానించారు. నూతన నిబంధనలు, అధిక పన్నులు, కమోడిటీ ధరలు ఎంట్రీలెవల్ కార్ల ధరలు పెరిగేందుకు కారణమైనట్లు తెలియజేశారు. దీంతో హ్యాచ్ బ్యాక్ విక్రయాలు క్షీణిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారిందని, మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా కంపెనీ సైతం వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. వెరసి మారుతీ పెద్ద కార్లతోపాటు, ఎస్‌యూవీలను సైతం ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. క్యూ 4 ఫలితాల్లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 1,876 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,241 కోట్లు ఆర్జించింది. సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తిని దెబ్బతీసినప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 24,034 కోట్ల నుంచి రూ. 26,749 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 60 చొప్పున డివిడెండును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా పెట్టుబడి వ్యయాలకు తెరతీయనున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. దీనిలో భాగంగా మనేసర్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లమేర విస్తరించనున్నట్లు సీఎఫ్‌వో అజయ్ సేథ్ పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 8 లక్షల వాహనాలు. వాహన అమ్మకాలు డీలా ఈ క్యూ4లో మారుతీ వాహన విక్రయాలు స్వల్ప వెనకడుగుతో 4,88,830 యూనిట్లకు చేరాయి. వీటిలో దేశీ అమ్మకాలు 8 శాతం క్షీణించి 4,20,376 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే రికార్డు సృష్టిస్తూ 68,454 యూనిట్లను ఎగుమతి చేసింది. ఒక త్రైమాసికంలో ఇవి అత్యధికమని కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం తగ్గి రూ. 3,880 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 4,389 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 70,372 కోట్ల నుంచి రూ. 88,330 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతంపైగా పుంజుకుని 16,52,653 యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ విక్రయాలు 4 శాతం బలపడి 14,14,277 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 2,38,376 వాహనాలను ఎగుమతి చేసింది. 2020–21లో ఎగుమతైన వాహనాలు 96,139 మాత్రమే. చిప్‌ల కొరత కోవిడ్–19, కమోడిటీల ధరలు, చిప్‌ల కొరత వంటి సమస్యలతో గతేడాది సవాళ్లు విసిరినట్లు మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ విడిభాగాల కొరత కారణంగా గతేడాది 2.7 లక్షల వాహనాల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు మారుతీ అంచనా వేసింది. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు ఇబ్బంది ఎదురైనట్లు పేర్కొంది. దీంతో 2.68 లక్షల వాహనాలకు కస్టమర్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. వాహన ధరలను పెంచడం ద్వారా స్టీల్, అల్యూమినియం తదితర కమోడిటీల పెరుగుదలను కొంతమేర ఎదుర్కోగలిగినట్లు వివరించింది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా! -
ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్ధేశించిన తదుపరి దశ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే.. తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వస్తుందని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ స్పష్టం చేశారు.ఇదే జరిగితే అమ్మకాలు మరింత పడిపోతాయని,పరిశ్రమ ఇప్పటికే తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు గణనీయంగా పెరగడంతో ప్రజలు కొత్త కార్లను కొనడం కష్టంగా ఉందని అన్నారు. ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ) ప్రమాణాల అమలుకు ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం. పరిశ్రమ వృద్ధి సున్నా స్థాయికి వచ్చింది. కరోనా మహమ్మారి వేళ ప్రజల ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో కార్ల ధర ఇంకాస్త అధికమైతే పరిశ్రమ మరింత దిగజారుతుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు కార్లను కొనే స్తోమత తగ్గింది’ అని పేర్కొన్నారు. బీఎస్–6 ఉద్గార నిబంధనలలో పొందుపరిచిన సీఏఎఫ్ఈ రెండవ దశ ప్రమాణాలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. అమలు తేదీని 2024 ఏప్రిల్ 1 తేదీకి వాయిదా వేయాల్సిందిగా సియామ్ సైతం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించింది. సీఏఎఫ్ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వాహన సంస్థలు సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిందే. చదవండి: గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
కేంద్రమే ఏదో ఒకటి చేయాలి, కార్ల ధరలపై మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: కార్ల కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతున్నట్టు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లో కార్లపై గరిష్ట స్థాయిలోని జీఎస్టీ, తదితర కారణాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు ఈ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ సరైన వృద్ధిని చూడలేదని అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన తన సందేశం ఇచ్చారు. ‘‘కార్లపై జీఎస్టీ అంతకుముందు ఎక్సైజ్ సుంకం ఆధారంగా ఉంది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే జీఎస్టీ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు తగ్గించేందుకు ముందుకు రాకపోతే చక్కని వృద్ధి సాధ్యపడదు’’ అని ఆయన వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపిందంటూ.. వచ్చే మూడు త్రైమాసికాల్లో పనితీరు అన్నది ప్రధానంగా ప్రజలు తీసుకునే వ్యాక్సిన్లు, రక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో 2021–22 ఆర్థిక సంవత్సరంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఇది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలకు దారితీసింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంలో కోలుకున్న డిమాండ్ మళ్లీ పడిపోయింది. దీంతో క్యూ1లో విక్రయాలు 3,53,600 యూనిట్లకే పరిమితమయ్యాయి’’ అని భార్గవ పేర్కొన్నారు. వైరస్ ప్రభావంపైనే భవిష్యత్తు విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ విస్తృత ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దిశలో తగిన చర్యలు అవసరమన్నారు. -
ఆదుకోండి మహాప్రభో!!
న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్ఏడీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు.. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. రుణ లభ్యత పెరిగేలా చూడాలి.. ‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు. పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. -
2020 నుంచి ఆ కార్ల అమ్మకాల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్లను విక్రయించబోమని అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్ భారీగా పడిపోవడంతో తాము 2020, ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్ల అమ్మకాన్ని చేపట్టడంలేదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. కాగా 1500 సీసీ పైబడిన డీజిల్ కార్లను మాత్రం విక్రయించేందుకు కంపెనీ మొగ్గుచూపుతోంది. మారుతి ఇటీవల లాంఛ్ చేసిన బాలెనో ఇదే కేటగిరీకి చెందిన వాహనం కావడం గమనార్హం. కేవలం 1500 సీసీ డీజిల్ వాహనానికే భవిష్యత్ ఉందని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్ వాహనాల తయారీపై తాము ఓ నిర్ణయం తీసుకుంటామని భార్గవ వెల్లడించారు. బీఎస్ 5 ప్రమాణాలు అమల్లోకి వస్తే 1500 సీసీ లోపు డీజిల్ ఇంజన్లకు ఆదరణ ఉండదని మారుతి భావిస్తోంది. బీఎస్ 4 వాహనాల విక్రయం, రిజిస్ర్టేషన్‌కు 2020 మార్చి 31ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్ధారించిన సంగతి తెలిసిందే. బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు గిరాకీ పెరుగుతుందని తదనుగుణంగా తమతో పాటు డీలర్లు సమిష్టిగా పనిచేసి ధరలు నిలకడగా ఉండేందుకు పూనుకోవాలని అన్నారు. గడువులోగా తాము తమ 16 మోడళ్లను అప్డేట్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల విషయంలో అనిశ్చితి నెలకొందని అభిప్రాయపడ్డారు. -
మారుతీ విక్రయ అంచనాల్లో కోత
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వాహన విక్రయ అంచనాలను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 10–12 శాతం రేంజ్లో వృద్ధి చెందగలవని ఈ కంపెనీ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంచనాలను 8 శాతానికి తగ్గిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం వంటివి దీనికి కారణాలని చెప్పారు. అమ్మకాలు బాగా ఉండే విభాగంలో కొత్త మోడళ్లను అందించలేకపోవడం కూడా విక్రయాలపై ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల ముందు సంవత్సరంలో వాహన విక్రయాలు తగ్గుతాయని, ఎన్నికల సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని చరిత్ర చెబుతోందని వివరించారు. ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు... డీలర్ల వద్ద నిల్వలను తగ్గించే క్రమంలో భాగం గా ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని భార్గవ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో కొత్త మోడల్‌ను మార్కె ట్లోకి తేనున్నామని, ఫలితంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మారుతీ జోరు తగ్గింది..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ, విక్రయ సంస్థ మారుతీ సుజుకి సెప్టెంబర్ క్వార్టర్లో గడ్డు పరిస్థితులను చవిచూసింది. కంపెనీ నికర లాభం ఏకంగా 10 శాతం తగ్గి రూ.2,240 కోట్లకు పరిమితమయింది. ప్రధానంగా రూపాయి విలువ క్షీణత, కమోడిటీ ధరలు పెరగడం, విక్రయాల ప్రచారంపై చేసిన ఖర్చులు మార్జిన్లపై ప్రభావం చూపించాయి. దేశ కార్ల మార్కెట్లో సగం వాటా మారుతీకే ఉన్న విషయం తెలిసిందే. కిందటేడాది ఇదే కాలంలో మారుతి లాభం రూ.2,483 కోట్లుగా ఉంది. విక్రయాలపై ఆదాయం అతి స్వల్పంగా పెరిగి రూ.21,438 కోట్ల నుంచి రూ.21,552 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ విక్రయించిన కార్లు 1.5 శాతం తగ్గి 4,84,848 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘చమురు ధరలు పెరగడం వల్ల ఎక్కువ ప్రభావమే పడింది. ఇక కొనుగోలు సమయంలోనే మూడేళ్ల కాలానికి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి రావడం వల్ల కస్టమర్ రూ.9,000 అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది కూడా కొనుగోళ్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది’’ అని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు. డీజిల్ కార్లకు సంబంధించి చట్టాల్లోనూ అనిశ్చితి నెలకొందని, ఇది ఢిల్లీ/ఎన్సీఆర్ మార్కెట్లో విక్రయాలపై ప్రభావం చూపించిందని చెప్పారు. ఈ ఏడాది విక్రయాల్లో 10 శాతం వృద్ధికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని, తమ వంతు ప్రయత్నాలు చేస్తామని భార్గవ చెప్పారు. కంపెనీ నికర లాభం తగ్గడం చివరిగా 2013–14 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చోటు చేసుకుంది. పండుగ విక్రయాలు అంతంతే ప్రస్తుత పండుగ సీజన్ విక్రయాలను పెంచలేకపోయిందని, గతంలో మాదిరే విక్రయాలు ఉన్నాయని భార్గవ తెలిపారు. కనీసం 10–15 శాతం అధిక విక్రయాలు ఉంటాయని అంచనా వేసినప్పటికీ ఉపయోగం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఎన్జీ ఇంధనాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తుండడంతో... సీఎన్జీ ఆధారిత వాహనాల తయారీని పెంచనున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం 8 మోడళ్లను సీఎన్జీ ఆప్షన్‌తో అందిస్తున్నాం. ఈ ఏడాది వీటి విక్రయాలు 50 శాతం పెరిగాయి. కస్టమర్లు సీఎన్జీ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది’’ అని తెలియజేశారు. గడువుకు ముందే బీఎస్4 వాహనాల తయారీని నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి ఆరు నెలల కాలంలో రూపాయి క్షీణత వల్ల తమ మార్జిన్లపై 1.2 శాతం మేర ప్రభావం ఉన్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్‌సేత్ తెలిపారు. ఏప్రిల్– సెప్టెంబర్ కాలంలో మారుతి సుజుకి నికర లాభం 4.3 శాతం వృద్ధితో రూ.4,215 కోట్లుగా ఉంటే, ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ.43,362 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2018–19 తొలి ఆరు నెలల్లో 10 శాతం అదనంగా మొత్తం 9,75,327 కార్ల విక్రయాలను నమోదు చేసింది. -
ఎలక్ట్రిక్ కార్లపైనా మారుతీ దృష్టి
► కస్టమర్ల అభిరుచిని బట్టి కొత్త మోడల్స్ ► 3–5 ఏళ్లపాటు రెండంకెల వృద్ధి ► ఏజీఎంలో చైర్మన్ ఆర్సీ భార్గవ న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కూడా ఈ విభాగంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. కస్టమర్ల అభిరుచిని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కంపెనీ 36వ ఏజీఎంలో చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. ‘ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. ఇది ఆ వాహనాల వినియోగానికి, దీర్ఘకాలంలో పర్యావరణానికి మేలు చేసే దిశగా హర్షించతగ్గ నిర్ణయం. ఈ విభాగంలో వెనుకబడిపోకుండా మారుతీ చర్యలు తీసుకుంటుంది. కస్టమర్లూ వాటిని కోరుకుంటున్నారని నిర్ధారణ అయితే ఎలక్ట్రిక్ విభాగంలోనూ మోడల్స్ తీసుకొస్తాం. ఈ లోగా ప్రస్తుత మోడల్స్ ఇంధన ఆదా సామర్థ్యాన్ని పెంచడం, మరిన్ని కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంపైనా దృష్టి పెడతాం‘ అని ఆయన తెలిపారు. ఏజీఎంలో సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి ఇరవై లక్షల అమ్మకాలు.. దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50% దాకా మార్కెట్ వాటా ఉన్న మారుతీ సుజుకీ అమ్మకాలు రాబోయే 3–5 ఏళ్లలోనూ రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేయగలవని భార్గవ చెప్పారు. ‘వచ్చే 3–5 ఏళ్లలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగానే సుజుకీ మద్దతుతో మారుతీ కూడా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుంది‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2020 నాటికి 20 లక్ష ల మేర, అటుపైన 25 లక్షలు.. 30 లక్షల దాకా అమ్మకాల లక్ష్యాన్ని సాధించగలమని భార్గవ చెప్పారు. -
మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు
పండుగల సీజన్ కల్లా బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కంపెనీ చైర్మన్ ఆర్.సి. భార్గవ న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మరిన్ని ప్రీమియం కార్లను మార్కెట్లోకి తేనుంది. దీంట్లో భాగంగా బాలెనో పేరుతో కొత్తగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను దసరా, దీపావళి పండుగల సీజన్లో మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. వచ్చే నెలలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగే ఆటో షోలో ఈ కారును మారుతీ మాతృసంస్థ జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్ప్ ప్రదర్శించనుంది. పండుగల సీజన్‌కల్లా మరో కొత్త ప్రీమియం కాంపాక్ట్ కారును తేనున్నట్లు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. కంపెనీ వాటాదారులకు నివేదించిన కంపెనీ వార్షిక నివేదిక (2014-15)లో ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు. గతంలో బాలెనో పేరుతో ఒక ప్రీమియం సెడాన్‌ను మారుతీ విక్రయించింది. దీనికి ఇప్పుడు తేనున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు పేరులో తప్ప మరేదాంట్లోనూ పోలిక లేదు. ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో సియాజ్ కారును విక్రయిస్తోంది. ప్రీమి యం కార్ల కోసం నెక్సా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగానే వాణిజ్య వాహనాల కోసం మరో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నది. -
మారుతీ రయ్.. రయ్..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఈ ఏడాది రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించబోతోంది. అన్ని సెగ్మెంట్ల కార్ల అమ్మకాలు బావుండటంతో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా అమ్మకాలు సాధిస్తామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఈ ఏడాదిలో 11.48 లక్షలకు మించి కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాల(10.6 లక్షలు)ను 2010లో సాధించామని వివరించారు. గత ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి 40,7 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటా ఈ ఏడాది ఇదే కాలానికి 44.8 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. అమ్మకాలు 7,39,247 నుంచి 13 శాతం వృద్ధితో 8,35,912కు పెరిగాయని తెలిపారు. ఆరు నెలల్లో ఎస్ఎక్స్ క్రాస్ ఎస్‌యూవీని, తేలిక రకం వాణిజ్య వాహనాన్ని(ఎల్సీవీ) మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. ఈ ఎల్‌సీవీని ఒకేసారి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురామని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. వాహన పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పటికీ, కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించామని కంపెనీ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. -
మారుతీ నిర్ణయంపై ఫండ్స్ ఫైర్
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ గుజరాత్ ప్రాజెక్ట్ విషయంలో జపనీస్ మాతృ సంస్థ సుజుకీతో కుదుర్చుకున్న డీల్‌పై సెబీకి ఫిర్యాదు చేసేందుకు ఆ కంపెనీలో పెట్టుబడులున్న మ్యూచువల్ ఫండ్స్ సిద్ధమవుతున్నాయి. గుజరాత్ ప్రాజెక్ట్‌ను సుజుకీకి బదలాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మారుతీ బోర్డు నిర్ణయంపై ఇప్పటికే వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ విషయంపై కంపెనీలో వాటా కలిగిన ఏడు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ తదితరాలున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఆందోళనను వ్యక్తం చేస్తూ మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవకు ఏడు పేజీల లేఖను పంపించాయి కూడా. ఈ విషయంపై స్పష్టతను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం మారుతీని సంప్రదించడం గమనార్హం. మారుతీ సుజుకీలో ఎల్ఐసీకి 6.93% వాటా ఉంది. మిగిలిన ఏడు ఫండ్స్ 3.93% వాటా కలిగి ఉన్నాయి. అయితే కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో రెండు మూడు రోజుల్లో సెబీకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే సెబీ సుమోటో పద్ధతిలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గుల్ల సంస్థగా... ఫండ్స్కుతోడుగా తాజాగా మరో 9 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు జత కలిశాయి. ఈ విషయంపట్ల తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మారుతీ యాజమాన్యానికి రాసిన లేఖలో పలు సందేహాలను లేవనెత్తాయి. మారుతీ బోర్డు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాయి. బోర్డు నిర్ణయం వల్ల కంపెనీ కేవలం మార్కెటింగ్‌కే పరిమితం అయ్యే గుల్ల(షెల్) సంస్థగా మిగులుతుందని వ్యాఖ్యానించాయి. ఇలాకాకుండా నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవడం ద్వారా తయారీ దిగ్గజంగా కంపెనీని పరిరక్షించాలని అభ్యర్థించాయి. కంపెనీకి కీలకమైన తయారీ బిజినెస్‌ను బదలాయించవద్దని కోరాయి. సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు దాదాపు 14% వాటా ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రమోటర్లకు 56.21% వాటా ఉంది. యాజమాన్యానికి లేఖ రాసిన సంస్థలలో ఎల్అండ్టీ ఎంఎఫ్, ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్ లైఫ్, రెలిగేర్ ఇన్వెస్కో తదితరాలున్నాయి. అయితే మారుతీ బిజినెస్‌ను పటిష్టపరచడంతోపాటు, వాటాదారులకు లబ్ది చేకూర్చే బాటలోనే తాము నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై తమ వివరణను నిరంతరంగా ఫండ్స్‌కు తెలియజేస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ నెల 15న మారుతీ బోర్డు సమావేశంకానున్న నేపథ్యంలో సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సైతం యాజమాన్యానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వార్షిక బిజినెస్ ప్రణాళికపై సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, గుజరాత్ ప్రాజెక్ట్ అంశం సైతం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 3% క్షీణించి రూ. 1,753 వద్ద ముగిసింది. ఏం జరిగింది? గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన కార్ల తయారీ ప్లాంట్‌ను జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు గత నెలలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌పై సుజుకీ కార్పొరేషన్ 100% పెట్టుబడులను పెట్టనుంది. ఇందుకు సుజుకీ మోటార్ గుజరాత్ పేరుతో సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ తయారయ్యే కార్లను మారుతీకి మాత్రమే సరఫరా చేయనున్నట్లు సుజుకీ వెల్లడించింది. తద్వారా మారుతీకి పెట్టుబడుల అవసరం తగ్గి లాభదాయకత మెరుగుపడుతుందని సుజుకీ పేర్కొంది. అయితే సుజుకీ అనుబంధ సంస్థ ద్వారా గుజరాత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ వ్యతిరేకించాయి. ఈ చర్య ఫలితంగా మారుతీ భవిష్యత్‌లో కార్ల తయారీ సంస్థగా కాకుండా పంపిణీ సంస్థగానే మిగులుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా మారుతీని ఫండ్స్ కోరాయి కూడా. ఇది వాటాదారులకు లబ్ది చేకూర్చకపోగా కంపెనీ విలువను దిగజార్చుతుందంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. సుజుకీ కార్పొరేషన్‌కు మారుతీ చెల్లించనున్న రాయల్టీలపైనా ఫండ్స్ ఆందోళన వ్యక్తం చేశాయి. మారుతీ సుజుకీకి సంబంధించి ఈక్విటీపై రిటర్న్(ఆర్‌వోఈ) క్షీణిస్తున్నదని, లాభదాయకతను పెంచేందుకు గుజరాత్ ప్లాంట్ ఉపయోగపడుతుందని ఫండ్స్ అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే అమ్మకాలలో 5.7% వాటా(రూ. 7,000 కోట్లు)ను మాతృ సంస్థ రాయల్టీకింద అందుకున్నదని తెలిపాయి.