మారుతీ రయ్.. రయ్..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఈ ఏడాది రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించబోతోంది. అన్ని సెగ్మెంట్ల కార్ల అమ్మకాలు బావుండటంతో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా అమ్మకాలు సాధిస్తామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఈ ఏడాదిలో 11.48 లక్షలకు మించి కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాల(10.6 లక్షలు)ను 2010లో సాధించామని వివరించారు.
గత ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి 40,7 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటా ఈ ఏడాది ఇదే కాలానికి 44.8 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. అమ్మకాలు 7,39,247 నుంచి 13 శాతం వృద్ధితో 8,35,912కు పెరిగాయని తెలిపారు. ఆరు నెలల్లో ఎస్‌ఎక్స్ క్రాస్ ఎస్‌యూవీని, తేలిక రకం వాణిజ్య వాహనాన్ని(ఎల్‌సీవీ) మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.
ఈ ఎల్‌సీవీని ఒకేసారి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురామని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. వాహన పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పటికీ, కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించామని కంపెనీ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు.