LCV
-
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
త్వరలో మారుతీ సూపర్ క్యారీ!
♦ మూడు నెలల్లో భారత మార్కెట్లోకి ♦ కంపెనీ నుంచి తొలి ఎల్సీవీ ఇదే ♦ తీవ్రతరం కానున్న పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి భారత లైట్ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్సీవీ) విభాగంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ‘సూపర్ క్యారీ’ మోడల్‌ను మూడునెలల్లో దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ ఆర్.ఎస్.కల్సి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గుర్గావ్ ప్లాంటులో ఈ వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ద క్షిణాఫ్రికా, టాంజానియాకు కంపెనీ ఈ వాహనాలను ఎగుమతి చేయటం ఆరంభించింది. జూన్‌లో మొదటి లాట్ కింద 100 వాహనాలను సరఫరా చేశారు. సార్క్ దేశాలకూ గుర్గావ్ ప్లాంటు నుంచి ఎగుమతి చేయనున్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 80,000 యూనిట్లు. జపాన్ ఆటో దిగ్గజం సుజుకి... 1961లో సుజులైట్ క్యారీ పేరుతో తొలి ఎల్‌సీవీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ మోడల్ తాలూకు 11వ తరం అంతర్జాతీయంగా అందుబాటులో ఉంది. మార్కెట్‌కు ఊపు... భారత ప్యాసింజర్ వాహన విపణిలో మొదటి స్థానంలో ఉన్న మారుతి సుజుకి వాటా మే నెలలో ఏకంగా 48.5 శాతానికి ఎగసింది. పరిశ్రమ 7 శాతం వృద్ధి నమోదు చేస్తే, కంపెనీ 13 శాతం వృద్ధి కనబరిచింది. ఈ స్థాయిలో దూసుకెళ్తున్న మారుతి... ఎల్సీవీ విభాగంలోనూ తన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తోంది. అందుబాటు ధర, మన్నిక, సర్వీసు... వంటి అంశాలే కలిసొస్తాయని కంపెనీ భావిస్తోంది. మార్కెట్ తీరుకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. సూపర్ క్యారీ అమ్మకాల కోసం ప్రత్యేక షోరూంలను కంపెనీ నెలకొల్పనుండగా... తాము దీనికి సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ మోటార్స్ ఎండీ వి.వరుణ్ దేవ్ తెలిపారు. ఇదీ ఎల్సీవీ పరిశ్రమ.. చిన్న వాణిజ్య వాహనాల (ఎల్సీవీ) పరిశ్రమ దేశంలో 2013-14లో 17 శాతం, 2014-15లో 11 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. కంపెనీలకు కాస్త ఊపిరినిస్తూ 2015-16లో 0.30 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 3,83,331 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ గాడిలో పడుతుందని సియామ్ అంచనా వేస్తోంది. ఈ సెగ్మెంట్లో... మారుతి రాకతో పోటీ పెరగనుంది. సూపర్ క్యారీ ప్రత్యేకతలు.. సూపర్ క్యారీ ఇంజన్ సామర్థ్యం 800 సీసీ. డీజిల్, సీఎన్జీ వెర్షన్లలో లభ్యమవుతుంది. 750 కిలోల బరువు మోయగలదు. 3.8 మీటర్ల పొడవు, 1.56 మీటర్ల వెడల్పు, లోడ్ డెక్ 2.18/1.49 మీటర్లు, 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, అయిదు గేర్లు, రెండు సీట్లతో క్యాబిన్, ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ దీని ఫీచర్లు. వాహనం ఎక్స్ షోరూం ధర రూ.4 లక్షలు ఉండొచ్చని అంచనా. -
టాటా మోటార్స్ కొత్త ఏస్ మోడల్
ధర రూ.4.31 లక్షలు ముంబై: టాటా మోటార్స్ కంపెనీ తేలిక రకం వాణిజ్య వాహనం(ఎల్సీవీ) సెగ్మెంట్లో ఏస్ మోడల్ కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏస్ మెగా పేరుతో అందిస్తున్న ఈ ఎల్సీవీ ధర రూ.4.31 లక్షలని టాటా మోటార్స్ తెలిపింది. ప్రస్తుత ఏస్ మోడల్స్ ధర కన్నా ఇది 10-12 శాతం అధికమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవి పిషరోడి చెప్పారు. 1 టన్ను కెపాసిటిలో లభిస్తున్న ఈ వాహనం 90 కిమీ.వేగంతో ప్రయాణిస్తుందని, ఈ కేటగిరి లో ఇదే అత్యుత్తమ వేగమని వివరించారు. అధిక వేగం కారణంగా ఎక్కువ ట్రిప్‌లు వేయవచ్చని, 18.5 కిమీ. మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. అమ్ముడయ్యే ప్రతీ ఐదు ఎల్సీవీల్లో ఒకటి ఏస్ మోడల్ అని వివరించారు. ఎల్సీవీ వాహనాల కొనుగోళ్లకు రుణా లు లభించడం దుర్లభంగా ఉందని, ఈ సెగ్మెంట్లో అమ్మకాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. గతంలో వాహన ధరలో 95 శాతం వరకూ రుణం లభించేదని, ఇప్పుడు 80-85 శాతం రేంజ్‌లోనే రుణం లభిస్తోందని వివరించారు. -
మారుతీ రయ్.. రయ్..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఈ ఏడాది రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించబోతోంది. అన్ని సెగ్మెంట్ల కార్ల అమ్మకాలు బావుండటంతో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా అమ్మకాలు సాధిస్తామని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఈ ఏడాదిలో 11.48 లక్షలకు మించి కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాల(10.6 లక్షలు)ను 2010లో సాధించామని వివరించారు. గత ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి 40,7 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటా ఈ ఏడాది ఇదే కాలానికి 44.8 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. అమ్మకాలు 7,39,247 నుంచి 13 శాతం వృద్ధితో 8,35,912కు పెరిగాయని తెలిపారు. ఆరు నెలల్లో ఎస్ఎక్స్ క్రాస్ ఎస్‌యూవీని, తేలిక రకం వాణిజ్య వాహనాన్ని(ఎల్సీవీ) మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. ఈ ఎల్‌సీవీని ఒకేసారి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురామని, ఎంపిక చేసిన ప్రాంతాల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. వాహన పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పటికీ, కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించామని కంపెనీ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు.