న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్‌సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్‌జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.
ఎల్‌సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్‌సీవీ సెగ్మెంట్‌లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్‌లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.
దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్‌లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment