
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్ రాజ్)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు.
తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు.
ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్ రాజ్ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment