న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పటిష్ట వృద్ధి బాటన పయనిస్తుందని పారిశ్రామిక వేదిక ఫిక్కీ త్రైమాసిక సర్వే పేర్కొంది. ఈ విభాగం ప్రస్తుత సగటు సామర్థ్య వినియోగం 70 శాతం అని పేర్కొన్న సర్వే, ఇది ఈ రంగం సుస్థిర క్రియాశీలతను సూచిస్తోందని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల అవుట్‌లుక్ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, సర్వేలో పాల్గొన్న దాదపు 40 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో సంస్థల సామర్థ్య విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించింది.
సవాళ్లూ ఉన్నాయ్...
అయితే విస్తరణ ప్రణాళికలకు అధిక ముడిసరుకు ధరలు, పెరిగిన రుణ వ్యయాలు, తగిన విధంగా లేని నిబంధనలు, అనుమతుల విధానాలు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, షిప్పింగ్ లేన్‌ల నిరోధం కారణంగా అధిక లాజిస్టిక్స్ ఖర్చు, తక్కువ దేశీయ– గ్లోబల్ డిమాండ్, భారతదేశంలోకి చౌక దిగుమతులు అధికం కావడం, అస్థిర మార్కెట్, ఇతర సప్లై చైన్ అంతరాయాలు అడ్డంకుగా ఉన్నాయని సర్వేలో ప్రతినిధులు పేర్కొన్నారు.
10 ప్రధాన రంగాలు ప్రాతిపదిక
10 ప్రధాన రంగాలకు చెందిన 300 భారీ, మధ్య, చిన్న తరహా పతయారీ యూనిట్ల ప్రతినిధుల (ఆటోమోటివ్– ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, కెమికల్స్ ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్, మెటల్–మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్– టెక్స్‌టైల్ మిషనరీ) అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న సంస్థల వార్షిక టర్నోవర్ రూ.2.8 లక్షల కోట్లు. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
ఈ ప్రాతిపదికన సూచీ అక్టోబర్ వరకూ గడచిన 16 నెలల కాలంలో వృద్ధి బాటలోనే నడుస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం ఉంది.ఈ రంగంలో ఒక్క తయారీ రంగం వాటా 70 శాతం. తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయని ఇటీవల విడుదలైన టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ కూడా వెల్లడించింది. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment