India manufacturing sector
-
తయారీ చక్రం స్పీడ్
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఫిబ్రవరిలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.9కి ఎగసింది. ఇది ఐదు నెలలు గరిష్ట స్థాయి. జనవరిలో సూచీ 56.5గా నమోదయ్యింది. సమీక్షా నెల్లో సూచీకి దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ సహకారం లభించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ద్రవ్యోల్బణం 2023 జూలై కనిష్ట స్థాయికి తగ్గడంతో తయారీ సంస్థల మార్జిన్లు మెరుగుపడినట్లు సర్వే పేర్కొనడం గమనార్హం. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానెల్లో కొనుగోలు చేసే మేనేజర్లకు పంపిన ప్రశ్నలు, ప్రతిస్పందనలను ఎస్అండ్పీ గ్లోబల్ మదింపుచేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐని ఆవిష్కరిస్తుంది. -
జోరు మీదున్న తయారీ రంగం.. గరిష్టానికి చేరిన పీఎంఐ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్లో మంచి పనితీరును కనబరిచింది. స్టాండెర్డ్ అండ్ పూర్స్ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 13 నెలల గరిష్టం 57.8ని తాకింది. నవంబర్‌లో ఈ సూచీ 55.7 వద్ద ఉంది. కొత్త ఆర్డర్లు, పటిష్ట డిమాండ్ తాజా సానుకూల ఫలితానికి కారణమని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన పీఎంఐ వరుసగా 18 నెలల నుంచి వృద్ధి బాటలోనే కొనసాగుతోంది. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు. -
Ficci survey: తయారీ రంగానికి వచ్చే 9 నెలలూ ఢోకా లేదు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పటిష్ట వృద్ధి బాటన పయనిస్తుందని పారిశ్రామిక వేదిక ఫిక్కీ త్రైమాసిక సర్వే పేర్కొంది. ఈ విభాగం ప్రస్తుత సగటు సామర్థ్య వినియోగం 70 శాతం అని పేర్కొన్న సర్వే, ఇది ఈ రంగం సుస్థిర క్రియాశీలతను సూచిస్తోందని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల అవుట్‌లుక్ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, సర్వేలో పాల్గొన్న దాదపు 40 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో సంస్థల సామర్థ్య విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించింది. సవాళ్లూ ఉన్నాయ్... అయితే విస్తరణ ప్రణాళికలకు అధిక ముడిసరుకు ధరలు, పెరిగిన రుణ వ్యయాలు, తగిన విధంగా లేని నిబంధనలు, అనుమతుల విధానాలు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, షిప్పింగ్ లేన్ల నిరోధం కారణంగా అధిక లాజిస్టిక్స్ ఖర్చు, తక్కువ దేశీయ– గ్లోబల్ డిమాండ్, భారతదేశంలోకి చౌక దిగుమతులు అధికం కావడం, అస్థిర మార్కెట్, ఇతర సప్లై చైన్ అంతరాయాలు అడ్డంకుగా ఉన్నాయని సర్వేలో ప్రతినిధులు పేర్కొన్నారు. 10 ప్రధాన రంగాలు ప్రాతిపదిక 10 ప్రధాన రంగాలకు చెందిన 300 భారీ, మధ్య, చిన్న తరహా పతయారీ యూనిట్ల ప్రతినిధుల (ఆటోమోటివ్– ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, కెమికల్స్ ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్, మెటల్–మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్– టెక్స్టైల్ మిషనరీ) అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న సంస్థల వార్షిక టర్నోవర్ రూ.2.8 లక్షల కోట్లు. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ అక్టోబర్ వరకూ గడచిన 16 నెలల కాలంలో వృద్ధి బాటలోనే నడుస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం ఉంది.ఈ రంగంలో ఒక్క తయారీ రంగం వాటా 70 శాతం. తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయని ఇటీవల విడుదలైన టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ కూడా వెల్లడించింది. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. -
భారత్‌లో..ఆపిల్,టెస్లాలకు బ్రేక్..ఈ ఏడాది లేనట్లే!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్రం తెచ్చిన 'లోకల్'ప్రతిపాదనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భారత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డ్రాగన్ కంట్రీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత్ పై ఆయన తీరు ఎలా ఉన్నా.. మనదేశంలో టెస్లా కార్ల తయారీ యూనిట్లను మొదలుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టెస్లా ఇండియాలో అడుగుపెట్టకపోతే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో సత్తా చాటేందుకు దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రముఖ ఆటోమోటీవ్ అండ్ డివైజ్ ఈకోసిస్టమ్ రీసెర్చ్ ఎనలిస్ట్ సౌమెన్ మండల్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌కు తెలిపారు.ఈ సందర్భంగా టెస్లాతో పాటు ఆపిల్ సైతం భారత్‌లో అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉత్పత్తులే ముందు.. ఆ తర్వాతే ఏదైనా భారత్‌లో టెస్లా కార్లను తొలత విక్రయించి.. ఆ తర్వాత తయారీ యూనిట్లు ప్రారంభిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. కానీ కేంద్రం దేశీయంగా టెస్లా కార్ల విక్రయం కంటే ఇక్కడ నిర్మించబోయే ఫ్యాక్టరీలపై స్పష్టత ఇవ్వాలని టెస్లాను కోరింది. టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ సైతం ముంబైలో ఫస్ట్ బ్రాండెడ్ రీటైయిల్ స్టోర్‌తో పాటు అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కానీ చిప్ షార్టేజ్ వల్ల సాధ్య పడలేదు. త్వరలో ఆపిల్, టెస్లా సమస్యలు ఓ కొల్లిక్కి వస్తాయని, వచ్చే ఏడాది నాటికి ఆ రెండు దిగ్గజ కంపెనీలు దేశీయ తయారీ యూనిట్లను ప్రారంభించనున్నట్లు ఎనలిస్ట్ సౌమెన్ మండల్ అన్నారు. ఇబ్బందుల్లో ఆటోమొబైల్ సంస్థలు.. మైక్రోచిప్ షార్టేజ్ వల్ల ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సౌమెన్ మండల్ చెప్పారు.ముఖ్యంగా స్టెల్లాంటిస్,వోక్స్వ్యాగన్, టయోటా,బీఎండబ్ల్యూ, ఫోర్డ్ కంపెనీలు కార్ల ఉత్పత్తుల్ని తగ్గించాయన్న సౌమెన్ మండల్..2023 నాటికి చిప్ షార్టేజ్ కొరత తగ్గిపోతుందని ఆటోమొబైల్ సంస్థలు భావిస్తున్నాయన్నారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం వచ్చే ఏడాదిలోపే చిప్ సమస్య తొలగిపోతుందనే ధీమాగా ఉన్నారని వెల్లడించారు. చదవండి: వీడే ఫ్యూచర్ ఎలన్‌మస్క్.. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓపెన్ లెటర్ -
ఊహించినదానికన్నా ఎక్కువగా భారత్ పోటీ
♦ తయారీ రంగంపై చైనా పత్రిక ♦ గ్లోబల్ టైమ్స్ విశ్లేషణ బీజింగ్: చైనా పరిశ్రమ ఊహించినదానికన్నా భారత్ తయారీ రంగం నుంచీ పోటీ అధికంగా ఉందని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ మంగళవారం పేర్కొంది. ఈ పోటీని తట్టుకోడానికి చైనా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. చైనాలో వేతనాల నివేదికలను ప్రస్తావిస్తూ... 2008 నుంచి చైనాలో వేతనాలు 10.6 శాతం పెరిగితే, భారత్ విషయంలో ఈ పెరుగుదల కేవలం 0.2 శాతంగానే ఉందని తెలిపింది. తద్వారా భారత్ ప్రస్తుతం అతితక్కువ కార్మిక వ్యయ ప్రయోజన దేశంగా మారిందని పేర్కొంటూ, ఇది చైనా తయారీ రంగానికి ప్రమాద సంకేతమేనని వివరించింది. అలాగే చైనా వృద్ధికి రియల్టీపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుని, తయారీ రంగంలో తగిన పెట్టుబడులు, వాతావరణం కల్పనపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఇప్పటికే హువాయ్ భారత్ బాట... హువాయ్ వంటి చైనా స్మార్ట్‌ఫోన్ విక్రయ సంస్థలు తక్కువ వేతన వ్యయాల కారణంగా భారత్‌లో హ్యాండ్సెట్స్ తయారీకి ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నాయని గ్లోబల్ టైమ్స్ తన వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. అణు విద్యుత్ పరిశ్రమ వంటి అత్యధిక సాంకేతిక రంగాల అభివృద్ధి, సేవలపై దృష్టి పెట్టిన చైనా, తయారీ రంగం వృద్ధిని నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ రం గంలో అత్యధిక ఉపాధి అవకాశాలు ఉండడమే దీనికి కారణంగా వివరించింది. అలాగే ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సృష్టించగల విభాగంగా సేవల రంగాన్ని తక్షణం అభివృద్ధి చేయడం కష్టమనీ అభిప్రాయపడింది. ఆయా పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులోనూ తయారీ రంగం చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నని వివరించింది.