ఊహించినదానికన్నా ఎక్కువగా భారత్ పోటీ
♦ తయారీ రంగంపై చైనా పత్రిక
♦ గ్లోబల్ టైమ్స్ విశ్లేషణ
బీజింగ్: చైనా పరిశ్రమ ఊహించినదానికన్నా భారత్ తయారీ రంగం నుంచీ పోటీ అధికంగా ఉందని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ మంగళవారం పేర్కొంది. ఈ పోటీని తట్టుకోడానికి చైనా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. చైనాలో వేతనాల నివేదికలను ప్రస్తావిస్తూ... 2008 నుంచి చైనాలో వేతనాలు 10.6 శాతం పెరిగితే, భారత్ విషయంలో ఈ పెరుగుదల కేవలం 0.2 శాతంగానే ఉందని తెలిపింది. తద్వారా భారత్ ప్రస్తుతం అతితక్కువ కార్మిక వ్యయ ప్రయోజన దేశంగా మారిందని పేర్కొంటూ, ఇది చైనా తయారీ రంగానికి ప్రమాద సంకేతమేనని వివరించింది. అలాగే చైనా వృద్ధికి రియల్టీపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుని, తయారీ రంగంలో తగిన పెట్టుబడులు, వాతావరణం కల్పనపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది.
ఇప్పటికే హువాయ్ భారత్ బాట...
హువాయ్ వంటి చైనా స్మార్ట్‌ఫోన్ విక్రయ సంస్థలు తక్కువ వేతన వ్యయాల కారణంగా భారత్‌లో హ్యాండ్‌సెట్స్ తయారీకి ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నాయని గ్లోబల్ టైమ్స్ తన వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. అణు విద్యుత్ పరిశ్రమ వంటి అత్యధిక సాంకేతిక రంగాల అభివృద్ధి, సేవలపై దృష్టి పెట్టిన చైనా, తయారీ రంగం వృద్ధిని నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ రం గంలో అత్యధిక ఉపాధి అవకాశాలు ఉండడమే దీనికి కారణంగా వివరించింది. అలాగే ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సృష్టించగల విభాగంగా సేవల రంగాన్ని తక్షణం అభివృద్ధి చేయడం కష్టమనీ అభిప్రాయపడింది. ఆయా పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులోనూ తయారీ రంగం చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నని వివరించింది.