
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది.
రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్‌డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్‌ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి.
అయితే, ఓఎన్‌డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్‌డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్‌డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని వివరాలు..
► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్‌డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్‌డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది.
► ఆన్‌లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్‌డీసీ సహాయకరంగా ఉండనుంది.
► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి.
► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్‌ఎంఈలకు ఓఎన్‌డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు.
► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్‌డీసీ ఉపయోగకరంగా ఉండగలదు.
► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్‌వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు.
Comments
Please login to add a commentAdd a comment