Six months time
-
Ficci survey: తయారీ రంగానికి వచ్చే 9 నెలలూ ఢోకా లేదు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పటిష్ట వృద్ధి బాటన పయనిస్తుందని పారిశ్రామిక వేదిక ఫిక్కీ త్రైమాసిక సర్వే పేర్కొంది. ఈ విభాగం ప్రస్తుత సగటు సామర్థ్య వినియోగం 70 శాతం అని పేర్కొన్న సర్వే, ఇది ఈ రంగం సుస్థిర క్రియాశీలతను సూచిస్తోందని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల అవుట్‌లుక్ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, సర్వేలో పాల్గొన్న దాదపు 40 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో సంస్థల సామర్థ్య విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించింది. సవాళ్లూ ఉన్నాయ్... అయితే విస్తరణ ప్రణాళికలకు అధిక ముడిసరుకు ధరలు, పెరిగిన రుణ వ్యయాలు, తగిన విధంగా లేని నిబంధనలు, అనుమతుల విధానాలు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, షిప్పింగ్ లేన్ల నిరోధం కారణంగా అధిక లాజిస్టిక్స్ ఖర్చు, తక్కువ దేశీయ– గ్లోబల్ డిమాండ్, భారతదేశంలోకి చౌక దిగుమతులు అధికం కావడం, అస్థిర మార్కెట్, ఇతర సప్లై చైన్ అంతరాయాలు అడ్డంకుగా ఉన్నాయని సర్వేలో ప్రతినిధులు పేర్కొన్నారు. 10 ప్రధాన రంగాలు ప్రాతిపదిక 10 ప్రధాన రంగాలకు చెందిన 300 భారీ, మధ్య, చిన్న తరహా పతయారీ యూనిట్ల ప్రతినిధుల (ఆటోమోటివ్– ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, కెమికల్స్ ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్, మెటల్–మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్– టెక్స్టైల్ మిషనరీ) అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న సంస్థల వార్షిక టర్నోవర్ రూ.2.8 లక్షల కోట్లు. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ అక్టోబర్ వరకూ గడచిన 16 నెలల కాలంలో వృద్ధి బాటలోనే నడుస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం ఉంది.ఈ రంగంలో ఒక్క తయారీ రంగం వాటా 70 శాతం. తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయని ఇటీవల విడుదలైన టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ కూడా వెల్లడించింది. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. -
కరోనా దెబ్బ: తిరోగమనమే!
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కకావికలం అయిందని అర్ధ వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల ఆదాయ వివరాలను పరిశీలిస్తే అప్పులు మినహా అన్నిం టిలో తిరోగమనమే కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయాయని కాగ్ లెక్కలు చెబు తున్నాయి. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను... ఇలా అన్ని ఆదాయాలు తగ్గాయి. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర సాయం కూడా ఆశించినంత లేకపోవడంతో తొలి ఆరు నెలల ఆదాయం రూ. 63,970 కోట్లకే పరిమితమైంది. కాగ్ తేల్చిన ముఖ్యాంశాలివి.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,76,393 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించగా ఆరు నెలల్లో వచ్చిన మొత్తం ఆదాయం రూ. 63,970 కోట్లు. అంటే బడ్జెట్ అంచనాలో వచ్చింది కేవలం 36 శాతమే. అదే గతేడాది ఆరు నెలల్లో 43 శాతం రాబడులు సమకూరాయి. ఈ ఏడాది మొత్తం రూ. 33,191 కోట్లు అప్పులు సమకూర్చుకోవాల్సి ఉండగా తొలి ఆరు నెలల్లో 78 శాతం అంటే రూ. 25,989 కోట్లు వచ్చేశాయి. అదే గతేడాది ఆరు నెలల్లో 61 శాతమే అప్పులు అవసరమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 32,671 కోట్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వస్తుందని అంచనా వేయగా ఆరు నెలల్లో 32 శాతం అంటే రూ. 10,437 కోట్లు వచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 10,000 కోట్లు వస్తాయని వార్షిక బడ్జెట్ అంచనాలో చూపగా ఆరు నెలల్లో వచ్చింది రూ. 1,657 కోట్లే. అమ్మకపు పన్ను కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,400 కోట్ల రాబడి అంచనా కాగా తొలి సగం ఏడాదిలో రూ. 8,148 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనాలో రాబడి 31 శాతం. అమ్మకపు పన్ను ఆదాయం గతేడాది తొలి అర్ధ వార్షికంలో 42 శాతం సమకూరింది. ఎక్సైజ్ ఆదాయం మాత్రమే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. ఈ సంవత్సరం రూ. 16,000 కోట్ల అంచనాలో రూ. 6,285.85 కోట్లు (39 శాతం) వచ్చింది. గతేడాది వచ్చింది 42 శాతం. కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఈ ఏడాది అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ వాటా కింద 2020–21 సంవత్సరంలో రూ. 10,906 కోట్లు రావాల్సి ఉండగా ఆరు నెలల్లో రూ. 3,753 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో కూడా గతేడాదితో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ అంచనాకుగాను తొలి ఆరు నెలల్లో 55 శాతం రాగా, ఈసారి వచ్చింది 44 శాతమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 10,525 కోట్ల అంచనాకుగాను రూ. 4,649 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది పన్నేతర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈసారి రూ. 30,600 కోట్లను పన్నేతర ఆదాయం కింద అంచనా వేయగా అందులో 5 శాతం అంటే కేవలం రూ. 1,542 కోట్లే సగం సంవత్సరం పూర్తయ్యే సరికి వచ్చాయి. పన్ను ఆదాయం విషయానికి వస్తే గతేడాది సెప్టెంబర్‌లో రూ. 8,775 కోట్లను పన్ను ఆదాయం కింద రాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చింది రూ. 6,599 కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాది తొలి అర్ధ వార్షికంలో రెండు నెలలు పన్ను ఆదాయం రూ. 8,500 కోట్లు దాటితే ఈ ఏడాది రూ. 6,500 కోట్లు దాటలేదు. -
విడాకులకు ఆర్నెల్ల విరామం అక్కర్లేదు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: దంపతులకు విడాకులు మంజూరు చేసేముందు.. పునరాలోచనకు అవకాశం కల్పించేందుకు కనీసం ఆర్నెల్ల సమయం ఇచ్చే నిబంధనను ఇకపై ట్రయల్ కోర్టులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు.. వారి మధ్య సయోధ్యకు అవకాశం లేదని విచారణ కోర్టు భావిస్తే.. ఆ నిబంధనను పాటించకుండానే విడాకులు మంజూరు చేయొచ్చని మంగళవారం పేర్కొంది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలైన తరువాత.. తదుపరి విచారణకు కనీసం ఆర్నెల్ల విరామం ఉండాలి. ఈ విరామంలో వారి మధ్య సయోధ్యకు అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ నిబంధనను చేర్చారు. అయితే, ఆ చట్టంలో ఈ నిబంధన ఉన్న సెక్షన్ 13బీ(2)ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, అది సలహాపూర్వకమైనది మాత్రమేనని, దంపతులిద్దరూ తిరిగి కలిసే అవకాశాల్లేవని విచారణ కోర్టు భావిస్తే.. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌దారులైన దంపతులు సరైన కారణంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేని పరిస్థితుల్లో.. తల్లి దండ్రులు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని వాడుకోవచ్చని, వారి తరఫున తల్లిదండ్రులు కాని, సహోదరులు కాని హాజరు కావచ్చంది. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నామని, ఆర్నెల్ల విరామ నిబంధనను సడలించి, తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఒక జంట దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.