విడాకులకు ఆర్నెల్ల విరామం అక్కర్లేదు
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దంపతులకు విడాకులు మంజూరు చేసేముందు.. పునరాలోచనకు అవకాశం కల్పించేందుకు కనీసం ఆర్నెల్ల సమయం ఇచ్చే నిబంధనను ఇకపై ట్రయల్ కోర్టులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు.. వారి మధ్య సయోధ్యకు అవకాశం లేదని విచారణ కోర్టు భావిస్తే.. ఆ నిబంధనను పాటించకుండానే విడాకులు మంజూరు చేయొచ్చని మంగళవారం పేర్కొంది.
హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం.. విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలైన తరువాత.. తదుపరి విచారణకు కనీసం ఆర్నెల్ల విరామం ఉండాలి. ఈ విరామంలో వారి మధ్య సయోధ్యకు అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ నిబంధనను చేర్చారు. అయితే, ఆ చట్టంలో ఈ నిబంధన ఉన్న సెక్షన్ 13బీ(2)ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, అది సలహాపూర్వకమైనది మాత్రమేనని, దంపతులిద్దరూ తిరిగి కలిసే అవకాశాల్లేవని విచారణ కోర్టు భావిస్తే.. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం పేర్కొంది.
పిటిషన్‌దారులైన దంపతులు సరైన కారణంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేని పరిస్థితుల్లో.. తల్లి దండ్రులు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని వాడుకోవచ్చని, వారి తరఫున తల్లిదండ్రులు కాని, సహోదరులు కాని హాజరు కావచ్చంది. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నామని, ఆర్నెల్ల విరామ నిబంధనను సడలించి, తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఒక జంట దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.