ఆయనకు 89 ఏళ్లు. ఆయన భార్యకు 82 ఏళ్లు. భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆ పెద్దాయన కోర్టుకెక్కారు. కానీ, అది ఇప్పుడే కాదు లేండి. సుమారు 27 కిందట!. తమ వివాహ బంధం కుప్పకూలిపోయిందని, విడాకులు ఇప్పించాలని ఆయన చేసిన అభ్యర్థన న్యాయస్థానాల్లో నానుతూ వస్తోంది. చివరకు.. దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. పెళ్లి అనే పవిత్ర బంధానికే కట్టుబడి ఉంటానన్న ఆమె అభ్యర్థన వైపే మొగ్గుచూపింది. విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. తీర్పు ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ సింగ్ పనేసర్.. పరమ్‌జిత్ కౌర్‌లకు 1963లో వివాహమైంది. భర్త ఆర్మీలో పనిచేసేవారు. వారికి ముగ్గురు సంతానం. అయితే, అప్పట్లో మద్రాస్‌లో విధులు నిర్వహించే ఆయనతో వెళ్లేందుకు భార్య పరమ్‌జిత్ ఇష్టపడలేదు. దీంతో, 1984 నుంచి వారి బంధం ఒడిదుడుకులకు లోనైంది. ఈ క్రమంలో పరమ్‌జిత్ తొలుత అత్తమామలతో.. ఆ తరువాత కొడుకు వద్ద ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో.. 1996లో నిర్మల్ తొలిసారిగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
వివాహ చట్టంలో విడాకులకు అవసరమైన ‘‘క్రూరత్వం’’, ‘‘తనను విడిచిపెట్టి ఉండడం’’.. కారణాలుగా చూపించారాయన. దీంతో జిల్లా కోర్టు నాలుగేళ్ల తర్వాత.. అంటే 2000వ సంవత్సరంలో ఆయనకు విడాకులు మంజూరు చేసింది. కానీ, పరమ్‌జిత్ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడంతో.. ఏడాది తర్వాత కింది కోర్టు తీర్పును పైకోర్టు తోసిపుచ్చింది. అలా ఇన్నేళ్లు కోర్టుల్లో నలిగిన కేసు.. చివరకు సుప్రీం కోర్టుకు చేరింది.
జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలో కూడిన ధర్మాసనం ఈ విడాకుల పిటిషన్‌పై విచారణ జరిపి.. అక్టోబర్ 10వ తేదీన తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద.. వివాహ బంధం శాశ్వతంగా తెగిపోయిందన్న కారణంతో ఈ కేసులో విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. అన్ని సందర్భాల్లో ఒకే ఫార్మాలా వాడలేమని వ్యాఖ్యానించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. ఏ వ్యవహారంలోనైనా వ్యక్తులు లేదంటే పిటిషనర్లకు న్యాయం జరిగేలా తగు తీర్పు వెలువరించే ప్రత్యేకాధికారం సుప్రీం కోర్టుకు ఉంది.
‘‘ఈ కాలంలో విడాకులు తీసుకునే వారి పెరుగుతున్నప్పటికీ భారత సమాజంలో వివాహా వ్యవస్థకు ఇప్పటికీ ఓ పవిత్రస్థానం ఉంది. వివాహమనేది భార్యాభర్తల మధ్య ఉన్న భావోద్వేగపూరిత పవిత్ర బంధమని ఈమె అంటున్నారు. ఈ వయసులోనూ భర్త బాగోగులు చూసుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. అన్నింటికి మించి.. ఈ వయసులో డైవర్సీగా చనిపోదలుచుకోలేదన్న ఆమె అనడం గమనార్హం. ఈ వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేస్తే ఇరు వర్గాలకు పూర్తి న్యాయం జరగదు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు భర్త నిర్మల్ సింగ్ పనేసర్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment