భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కువమంది ప్రజలు సరసమైన కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇండియా బడ్జెట్ కార్లను తయారు చేయడానికి సన్నద్ధమవుతోందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు.
మార్కెట్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంది. దేశ ఆర్థిక స్థితిని తీర్చడానికి.. పౌరులు సురక్షితమైన & సౌకర్యవంతమైన కారును కలిగి ఉండాలనే లక్ష్యంతో తక్కువ ధరలో చిన్న కార్లను తయారు చేయడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని భార్గవ పేర్కొన్నారు.
ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ప్రస్తుతం మంచి వృద్ధిని కనపరిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఈ విభాగంలో మారుతి సుజుకి విక్రయాలు 2,22,193 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన కార్లు 2,54,973 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే అమ్మకాలు 12.8 శాతం తగ్గుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు భార్గవ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు చేరుకోవడంలో మారుతి సుజుకి గణనీయమైన వృద్ధి సాధించింది. కంపెనీ సర్వీస్ కూడా అద్భుతంగా ఉందని సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. మా అమ్మకాలు మొత్తంలో 46 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయని అన్నారు.
మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు. కానీ త్వరలోనే కంపెనీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ విభాగంలో కూడా సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ విభాగంలో లాంఛ్ అయ్యే మొదటికారు ఈవీఎక్స్ (eVX) అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment