రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు | Maruti Suzuki is planning a massive expansion | Sakshi
Sakshi News home page

రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు

Published Wed, Aug 30 2023 12:59 AM | Last Updated on Wed, Aug 30 2023 1:03 AM

Maruti Suzuki is planning a massive expansion - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షికోత్పత్తిని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) పాల్గొన్న సందర్భంగా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ మంగళవారం ఈ మేరకు ’మారుతీ 3.0’ వెర్షన్‌ భారీ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు.

తమ సంస్థ 40 ఏళ్లలో వార్షికంగా ఇరవై లక్షల యూనిట్ల తయారీ, అమ్మకాలను సాధించిందని ఆయన చెప్పారు. కంపెనీ ప్రస్థానంలోని మూడో దశలో టర్నోవరును రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైబ్రిడ్‌లు, సీఎన్‌జీ మొదలైన టెక్నాలజీలన్నింటినీ పరిశీలించనున్నట్లు భార్గవ చెప్పారు. 2030–31 నాటికి మరో 20 లక్షల వార్షికోత్పత్తి, 28 మోడల్స్‌ను జోడించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.

‘తొలి దశలో మాది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండేది. కోవిడ్‌ మహమ్మారితో మా రెండో దశ ముగిసింది.  ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్‌ ఆవిర్భవించింది. రాబోయే రోజులు చాలా సవాళ్లతో, చాలా అనిశ్చితితో కూడుకున్నవిగా ఉంటాయి.కొత్తగా ఇరవై లక్షల కార్ల సామర్థ్యాన్ని సాధించేందుకు దాదాపు రూ. 45,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అది కూడా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది‘ అని భార్గవ చెప్పారు.

మార్కెట్‌ వాటా మళ్లీ పెంచుకుంటాం..
చిన్న కార్లకు డిమాండ్‌ మందగించడంతో తగ్గిన తమ మార్కెట్‌ వాటాను .. వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ద్వారా మళ్లీ పెంచుకుంటామని భార్గవ ధీమా వ్యక్తం చేశారు. అటు ఎలక్ట్రిక్‌ వాహనాల విషయానికొస్తే.. దేశీయంగా విద్యుత్‌ వాహనాల పరిస్థితుల గురించి కంపెనీ యాజమాన్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు.

2024–25 నుంచి 2030–31 మధ్య కాలంలో ఆరు మోడల్స్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నాయని భార్గవ తెలిపారు. ఇక రూ. 10,000కు చేరువకు షేరు ధర చేరిన నేపథ్యంలో స్టాక్‌ను విభజించే అంశాన్ని బోర్డు ముందు ఉంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.  

ఆటోమోటివ్‌ రంగానికి పీఎల్‌ఐ స్కీము పొడిగింపు
ఆటోమోటివ్‌ రంగానికి సంబంధించిన రూ. 25,938 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే తెలిపారు. వాస్తవంగా 2022–23 నుంచి 2026–27 వరకు ఉద్దేశించిన ఈ స్కీము.. తాజా నిర్ణయంతో 2027–28 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

సబ్సిడీలను మూడు నెలలకోసారి విడుదల చేయడం, విలువ జోడింపును పరీక్షించే ఏజెన్సీల సంఖ్యను ప్రస్తుతమున్న రెండు నుంచి నాలుగుకు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమ వర్గాలు కోరాయని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. 2022 ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి దేశీయంగా తయారైన నిర్దిష్ట అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల అమ్మకాలకు ఈ స్కీము వర్తిస్తుంది.

దీని పనితీరును సమీక్షించిన సందర్భంగా మంత్రి తాజా వివరాలు వెల్లడించారు. కొత్త టె క్నాలజీ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయ డాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎల్‌ఐ స్కీముకి 95 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement