న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ..ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లేకపోయినప్పటికీ .. రాబోయే రోజుల్లో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి తొలి ఈవీ మోడల్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తోంది. మారుతీ సుజుకీ కొత్త ఎండీ, సీఈవో హిసాషి తకెయుచి ఈ విషయాలు వెల్లడించారు.
గుజరాత్‌లోని సుజుకీ మోటర్ ప్లాంటులో తమ తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశీ మార్కెట్లో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే ఈవీల విషయంలో మేము కాస్త వెనుకబడ్డాం. ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిమితంగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, పటిష్టమైన టెక్నాలజీతో రావాలనే ఉద్దేశంతో ఈవీలపై మేము గట్టిగానే కసరత్తు చేస్తున్నాం. ఏడాదిపైగా మా ప్రస్తుత మోడల్స్‌కు మోటర్లు, బ్యాటరీల్లాంటివి అమర్చి ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం‘ అని తకెయుచి వివరించారు.
2025లో తొలి ఈవీని ఆవిష్కరించిన తర్వాత వీలైనంత త్వరగా మరిన్ని మోడల్స్ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈవీలకు డిమాండ్ పెరిగే కొద్దీ సుజుకీ మోటర్స్ ప్లాంట్లతో పాటు మారుతీ సుజుకీ ఫ్యాక్టరీల్లో కూడా తయారీ చేపడతామన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయని, ఇప్పుడున్న టెక్నాలజీతో వాటిని చౌకగా ఉత్పత్తి చేయడం చాలా కష్టమైన వ్యవహారమని తకెయుచి తెలిపారు. మరోవైపు, మారుతీ కార్ల అమ్మకాలకు సంబంధించి 2.7లక్షల పైచిలుకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల కొరత కొంత తగ్గిందని, కానీ భవిష్యత్ అంచనాల గురించి చెప్పడం కష్టమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment