ఎలక్ట్రిక్ కార్లపైనా మారుతీ దృష్టి
► కస్టమర్ల అభిరుచిని బట్టి కొత్త మోడల్స్
► 3–5 ఏళ్లపాటు రెండంకెల వృద్ధి
► ఏజీఎంలో చైర్మన్ ఆర్‌సీ భార్గవ
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కూడా ఈ విభాగంపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. కస్టమర్ల అభిరుచిని బట్టి ఎలక్ట్రిక్ వాహనాలనూ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కంపెనీ 36వ ఏజీఎంలో చైర్మన్ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. ‘ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. ఇది ఆ వాహనాల వినియోగానికి, దీర్ఘకాలంలో పర్యావరణానికి మేలు చేసే దిశగా హర్షించతగ్గ నిర్ణయం.
ఈ విభాగంలో వెనుకబడిపోకుండా మారుతీ చర్యలు తీసుకుంటుంది. కస్టమర్లూ వాటిని కోరుకుంటున్నారని నిర్ధారణ అయితే ఎలక్ట్రిక్ విభాగంలోనూ మోడల్స్ తీసుకొస్తాం. ఈ లోగా ప్రస్తుత మోడల్స్ ఇంధన ఆదా సామర్థ్యాన్ని పెంచడం, మరిన్ని కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంపైనా దృష్టి పెడతాం‘ అని ఆయన తెలిపారు. ఏజీఎంలో సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ తదితరులు పాల్గొన్నారు.
2020 నాటికి ఇరవై లక్షల అమ్మకాలు..
దేశీయంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50% దాకా మార్కెట్ వాటా ఉన్న మారుతీ సుజుకీ అమ్మకాలు రాబోయే 3–5 ఏళ్లలోనూ రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేయగలవని భార్గవ చెప్పారు. ‘వచ్చే 3–5 ఏళ్లలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగానే సుజుకీ మద్దతుతో మారుతీ కూడా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుంది‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2020 నాటికి 20 లక్ష ల మేర, అటుపైన 25 లక్షలు.. 30 లక్షల దాకా అమ్మకాల లక్ష్యాన్ని సాధించగలమని భార్గవ చెప్పారు.