మారుతీ నిర్ణయంపై ఫండ్స్ ఫైర్ | Maruti Suzuki's Gujarat plans unchanged despite opposition | Sakshi
Sakshi News home page

మారుతీ నిర్ణయంపై ఫండ్స్ ఫైర్

Published Wed, Mar 12 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

మారుతీ నిర్ణయంపై ఫండ్స్ ఫైర్

మారుతీ నిర్ణయంపై ఫండ్స్ ఫైర్

 న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ గుజరాత్ ప్రాజెక్ట్ విషయంలో జపనీస్ మాతృ సంస్థ సుజుకీతో కుదుర్చుకున్న డీల్‌పై సెబీకి ఫిర్యాదు చేసేందుకు ఆ కంపెనీలో పెట్టుబడులున్న మ్యూచువల్ ఫండ్స్ సిద్ధమవుతున్నాయి. గుజరాత్ ప్రాజెక్ట్‌ను సుజుకీకి బదలాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మారుతీ బోర్డు నిర్ణయంపై ఇప్పటికే వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ విషయంపై కంపెనీలో వాటా కలిగిన ఏడు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ తదితరాలున్నాయి.

 ఇప్పటికే ఈ అంశంపై ఆందోళనను వ్యక్తం చేస్తూ మారుతీ చైర్మన్ ఆర్‌సీ భార్గవకు ఏడు పేజీల లేఖను పంపించాయి కూడా. ఈ విషయంపై స్పష్టతను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ సైతం మారుతీని సంప్రదించడం గమనార్హం. మారుతీ సుజుకీలో ఎల్‌ఐసీకి 6.93% వాటా ఉంది. మిగిలిన ఏడు ఫండ్స్ 3.93% వాటా కలిగి ఉన్నాయి. అయితే కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో రెండు మూడు రోజుల్లో సెబీకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే సెబీ సుమోటో పద్ధతిలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

 గుల్ల సంస్థగా...
 ఫండ్స్‌కుతోడుగా తాజాగా మరో 9 సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు జత కలిశాయి. ఈ విషయంపట్ల తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మారుతీ యాజమాన్యానికి రాసిన లేఖలో పలు సందేహాలను లేవనెత్తాయి. మారుతీ బోర్డు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాయి. బోర్డు నిర్ణయం వల్ల కంపెనీ కేవలం మార్కెటింగ్‌కే పరిమితం అయ్యే గుల్ల(షెల్) సంస్థగా మిగులుతుందని వ్యాఖ్యానించాయి. ఇలాకాకుండా నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవడం ద్వారా తయారీ దిగ్గజంగా కంపెనీని పరిరక్షించాలని అభ్యర్థించాయి. కంపెనీకి కీలకమైన తయారీ బిజినెస్‌ను బదలాయించవద్దని కోరాయి. సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు దాదాపు 14% వాటా ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రమోటర్లకు 56.21% వాటా ఉంది.

 యాజమాన్యానికి లేఖ రాసిన సంస్థలలో ఎల్‌అండ్‌టీ ఎంఎఫ్, ఎస్‌బీఐ ఎంఎఫ్, ఎస్‌బీఐ లైఫ్, రిలయన్స్ లైఫ్, రెలిగేర్ ఇన్వెస్కో తదితరాలున్నాయి. అయితే మారుతీ బిజినెస్‌ను పటిష్టపరచడంతోపాటు, వాటాదారులకు లబ్ది చేకూర్చే బాటలోనే తాము నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై తమ వివరణను నిరంతరంగా ఫండ్స్‌కు తెలియజేస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ నెల 15న మారుతీ బోర్డు సమావేశంకానున్న నేపథ్యంలో సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు సైతం యాజమాన్యానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వార్షిక బిజినెస్ ప్రణాళికపై సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, గుజరాత్ ప్రాజెక్ట్ అంశం సైతం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

 బీఎస్‌ఈలో కంపెనీ షేరు దాదాపు 3% క్షీణించి రూ. 1,753 వద్ద ముగిసింది.
 
 ఏం జరిగింది?  
 గుజరాత్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన కార్ల తయారీ ప్లాంట్‌ను జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు గత నెలలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌పై సుజుకీ కార్పొరేషన్ 100% పెట్టుబడులను పెట్టనుంది. ఇందుకు సుజుకీ మోటార్ గుజరాత్ పేరుతో సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ తయారయ్యే కార్లను మారుతీకి మాత్రమే సరఫరా చేయనున్నట్లు సుజుకీ వెల్లడించింది. తద్వారా మారుతీకి పెట్టుబడుల అవసరం తగ్గి లాభదాయకత మెరుగుపడుతుందని సుజుకీ పేర్కొంది. అయితే సుజుకీ అనుబంధ సంస్థ ద్వారా గుజరాత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ వ్యతిరేకించాయి.

 ఈ చర్య ఫలితంగా మారుతీ భవిష్యత్‌లో కార్ల తయారీ సంస్థగా కాకుండా పంపిణీ సంస్థగానే మిగులుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా మారుతీని ఫండ్స్ కోరాయి కూడా. ఇది వాటాదారులకు లబ్ది చేకూర్చకపోగా కంపెనీ విలువను దిగజార్చుతుందంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. సుజుకీ కార్పొరేషన్‌కు మారుతీ చెల్లించనున్న రాయల్టీలపైనా ఫండ్స్ ఆందోళన వ్యక్తం చేశాయి. మారుతీ సుజుకీకి సంబంధించి ఈక్విటీపై రిటర్న్(ఆర్‌వోఈ) క్షీణిస్తున్నదని, లాభదాయకతను పెంచేందుకు గుజరాత్ ప్లాంట్ ఉపయోగపడుతుందని ఫండ్స్ అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే అమ్మకాలలో 5.7% వాటా(రూ. 7,000 కోట్లు)ను మాతృ సంస్థ రాయల్టీకింద  అందుకున్నదని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement