న్యూఢిల్లీ: కార్ల కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతున్నట్టు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్‌లో కార్లపై గరిష్ట స్థాయిలోని జీఎస్‌టీ, తదితర కారణాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు ఈ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ సరైన వృద్ధిని చూడలేదని అభిప్రాయపడ్డారు.
మారుతి సుజుకీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన తన సందేశం ఇచ్చారు. ‘‘కార్లపై జీఎస్‌టీ అంతకుముందు ఎక్సైజ్ సుంకం ఆధారంగా ఉంది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే జీఎస్‌టీ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు తగ్గించేందుకు ముందుకు రాకపోతే చక్కని వృద్ధి సాధ్యపడదు’’ అని ఆయన వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపిందంటూ.. వచ్చే మూడు త్రైమాసికాల్లో పనితీరు అన్నది ప్రధానంగా ప్రజలు తీసుకునే వ్యాక్సిన్లు, రక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
‘‘ఈ ఏడాది మార్చిలో 2021–22 ఆర్థిక సంవత్సరంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఇది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, ఆంక్షలకు దారితీసింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంలో కోలుకున్న డిమాండ్ మళ్లీ పడిపోయింది. దీంతో క్యూ1లో విక్రయాలు 3,53,600 యూనిట్లకే పరిమితమయ్యాయి’’ అని భార్గవ పేర్కొన్నారు. వైరస్ ప్రభావంపైనే భవిష్యత్తు విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ విస్తృత ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దిశలో తగిన చర్యలు అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment