న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్‌సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.
‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!)
ఇతర రంగాల్లోనూ..
నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment