వాహన రంగానికి... బీఎస్‌–4 గుదిబండ  | Decreased Vehicle Sales Due To Coronavirus | Sakshi
Sakshi News home page

వాహన రంగానికి... బీఎస్‌–4 గుదిబండ 

Published Wed, Mar 11 2020 2:49 AM | Last Updated on Wed, Mar 11 2020 2:49 AM

Decreased Vehicle Sales Due To Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్న కారణంగా పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్‌–4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఇన్వెంటరీలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మొన్నటివరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి వేగంగా ఉన్నందువల్ల షారూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విజృంభిస్తోన్న వైరస్‌ పరంగా చూస్తే.. గడువు తేదీలోపు బీఎస్‌–4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. మరోవైపు పాత వాహనాల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావాలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

30–రోజులకు పెరిగిన నిల్వలు 
పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్‌ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు. వీటి ఇన్వెంటరీ 20–30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement