హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహన రంగంలో దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌లో రెండు ప్రధాన కంపెనీల మార్కెట్ వాటా తగ్గింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) ప్రకారం.. మారుతీ సుజుకీ 2022–23లో 14,79,221 యూనిట్లతో 40.86 శాతం వాటాకు వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 12,39,688 యూనిట్లతో 42.13 శాతం వాటా నమోదు చేసింది.
ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ఎదుర్కొంటున్నామని, 3.8 లక్షల యూనిట్ల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ గతంలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో హ్యుండై మోటార్ ఇండియా 5,25,088 యూనిట్లతో 14.51 శాతం వాటాకు పరిమితమైంది. 2021–22లో కంపెనీ 4,79,027 యూనిట్లతో 16.28 శాతం వాటా పొందింది.
ఇతర కంపెనీలు ఇలా..
టాటా మోటార్స్ మార్కెట్ వాటా 11.27 నుంచి 2022–23లో 13.39 శాతానికి ఎగబాకింది. విక్రయాలు 3,31,637 యూనిట్ల నుంచి 4,84,843 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటా 6.77 నుంచి 8.94 శాతానికి ఎగసింది. విక్రయాలు 1,99,125 నుంచి 3,23,691 యూనిట్లకు పెరిగాయి. కియా ఇండియా వాటా 5.3 నుంచి 6.42 శాతానికి, విక్రయాలు 1,56,021 నుంచి 2,32,570 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సైతం మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1,435 ఆర్‌టీవోలకుగాను 1,349 కార్యాలయాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఎఫ్‌ఏడీఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment