
జోరుగా వాహన విక్రయాలు
⇒ డిమాండ్ పుంజుకుంటోంది..
⇒ రానున్న నెలల్లో మరింతగా అమ్మకాలు: కంపెనీలు
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఇబ్బందుల నుంచి వాహన కంపెనీలు గట్టెక్కినట్లే. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉండటమే దీనికి కారణం. ప్రధాన వాహన కంపెనీలు–మారుతీ సుజుకీ, ఫోర్డ్ ఇండియా, టయోటా, టాటా మోటార్స్ దేశీయ విక్రయాలు జోరుగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి వాహన రంగం కోలుకుంటోందని నిపుణులంటున్నారు. కార్ల అమ్మకాలు బాగా ఉండగా, టూవీలర్ల విక్రయాలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయి.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి పరిశ్రమ కోలుకుంటోందని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) అనురాగ్ మెహరోత్ర చెప్పారు. బిజినెస్ సెంటిమెంట్స్‌కు సానుకూలంగా ఈ ఏడాది బడ్జెట్ ఉందని, దీంతో వినియోగదారుల విశ్వాసం మెరుగుపడిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గత రెండు నెలల్లో వాహన పరిశ్రమలో సానుకూల పోకడలు చోటు చేసుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(వాహన విభాగం) ప్రవీణ్ షా పేర్కొన్నారు.
గ్రామీణ సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో డిమాండ్ మరింతగా పుంజుకోగలదని ఆయన అంచనా వేస్తున్నారు. గత నెలలో సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో తమ అమ్మకాలు పెరిగాయని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునో చెప్పారు. టాటా టియాగోకు డిమాండ్ బాగా ఉండటంతో మంచి అమ్మకాలు సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు.
స్విఫ్ట్, ఎస్టిలో, డిజైన్, బాలెనో కార్ల అమ్మకాలు బాగా ఉండటంతో మారుతీ సుజుకీ 12% వృద్ది సాధించింది. జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగ, ఎస్–క్రాస్‌లతో కూడిన యుటిలిటీ, ఎస్‌యూవీ విటారా బ్రెజా కార్ల విక్రయాలు 111% పెరిగాయి. ఆల్టో, వేగన్ ఆర్‌వంటి చిన్న కార్ల అమ్మకాలు 7% తగ్గాయి.