బోణీ అదిరింది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో (ఏప్రిల్) వాహన విక్రయాలు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ,, టయోట, హోండా, నిస్సాన్ ఇండియా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. మారుతీ రికార్డ్ స్థాయిలో అమ్మకాలు సాధించింది. అంతేకాకుండా ఈ కం పెనీ మినీ, యుటిలిటి ఇలా ప్రతి సెగ్మెంట్ రెండంకెల వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ దేశీ విక్రయాలు 21% క్షీణించాయి. అయితే ప్రయాణికుల వాహన విక్రయాలు 23% వృద్ధి చెందాయి.
హీరో వాహన ధరలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ ‘హీరో మోటొకార్ప్’ తాజాగా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.500–రూ.2,200 శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల నేపథ్యంలో ధరలు పెంచుతున్నామని, ఈ తాజా నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. బీఎస్3 దెబ్బ రూ.600 కోట్లు: భారత్ స్టేజ్(బీఎస్)–3 వాహన విక్రయాలపై నిషేధం వల్ల టూవీలర్ కంపెనీలపై రూ.600 కోట్ల భారం పడిందని రేటింగ్ కంపెనీ ఇక్రా తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్3 వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై సుప్రీం కోర్ట్ నిషేధం విధించింది. 8 లక్షల బీఎస్3 వాహనాలు ఉండగా, వీటిల్లో 6.71 లక్షలు టూవీలర్లు. వీటి విక్రయానికి మార్చి చివరి 3 రోజుల్లో కంపెనీలు భారీ డిస్కౌంట్లిచ్చాయి.