న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఫలితాల పరంగా మెప్పించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.38 శాతం తగ్గి రూ.976.28 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి.
అమ్మకాల ఆదాయం మాత్రం రూ.9,091 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,010 కోట్లు, ఆదాయం రూ.8,371 కోట్లుగా ఉండటం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వ్యయాలు రూ.7,053 కోట్లుగా ఉంటే, తాజా సమీక్షా త్రైమాసికంలో అవి రూ.7,866 కోట్లకు ఎగశాయి.
వాహన విక్రయాలు
సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 21,34,051 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 20,22,805 యూనిట్లతో పోలిస్తే వృద్ధి చెందాయి. పనితీరుపై హీరోమోటో చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ... హీరో మోటారు సైకిళ్లు, స్కూటర్లకు డిమాండ్ నిలకడగా ఉన్నట్టు చెప్పారు. దీంతో రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదు చేశామన్నారు. ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ విడుదల ద్వారా ఖరీదైన మోటారు సైకిళ్ల విభాగంలోకి తిరిగి అడుగుపెట్టినట్టు చెప్పారు.
రానున్న పండుగల సందర్భంగా ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. ‘‘హీరో మోటోకార్ప్‌లో గట్టి ఆర్థిక నిర్మాణం, మా ఐకానిక్ బ్రాండ్లకు బలమైన డిమాండ్ నెలకొల్పాం. దీంతో ప్రతీ క్వార్టర్‌లోనూ వృద్ధి నమోదు చేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇది కొనసాగుతుంది. ధరల పరమైన సవాళ్లను అధిగమించి లాభదాయకమైన, స్థిరమైన వృద్ధి కొనసాగిస్తాం’’ అని పవన్ ముంజాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment