న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’ అని వ్యాఖ్యానించారు. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీ అమ్మకాలు 13 శాతం తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అమ్మకాలు 41 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 33.82 శాతం, ఏప్రిల్–డిసెంబర్ కాలంలో 30 శాతం పెరిగాయి.
‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరగాలనేది సంస్థ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 5,45,683 యూనిట్లను విక్రయించాం.’ అని ఎస్‌ఎంఐపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా అన్నారు. మరోవైపు బజాజ్ ఆటో గతనెల మొత్తం విక్రయాలు 18 శాతం, దేశీ అమ్మకాలు 31 శాతం, ఎగుమతులు 16 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాల్లో 6 శాతం, దేశీ అమ్మకాల్లో ఒక శాతం, ఎగుమతుల్లో 22 శాతం పెరిగాయి. ఈ సంస్థ స్కూటర్ విక్రయాలు 9 శాతం పెరిగి 91,480 యూనిట్లుగా నిలిచాయి.
ఫోర్డ్ అమ్మకాలు 14.8% అప్
2018 డిసెంబర్ దేశీ అమ్మకాలు 5,840 యూనిట్లుగా ఉన్నట్లు ఫోర్డ్ ఇండియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5,087 యూనిట్ల విక్రయాలు జరగ్గా.. ఏడాది ప్రాతిపదికన 14.8% వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. అయితే, ఎగుమతులు 24.8 శాతం తగ్గిన కారణంగా.. గతనెల మొత్తం అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది.
సోనాలికా ట్రాక్టర్ విక్రయాలు 12% పెరిగాయి
గతనెల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 5,052 యూనిట్లుగా సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోల్చితే 11.9% పెరిగాయి. ఎగుమతులు 26 శాతం, మొత్తం అమ్మకాలు 14% వృద్ధి చెందాయి.
జీఎస్‌టీని తగ్గించాలి..
ప్రస్తుతం కేవలం కొన్ని వస్తు, సేవలపై మాత్రమే 28% జీఎస్‌టీ రేటు అమల్లో ఉండగా.. ఈ క్యాటగిరీలో ద్విచక్ర వాహనాలూ ఉన్నాయని పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. విలాస వస్తువులపై ఉండే ఈరేటును సామాన్యులు వినియోగించే బైక్‌లపై విధించడం సరికాదన్నారు. త్వరలోనే బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనలు అమలుకానుండగా.. ఈ నిర్ణయం తరువాత బైక్‌ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని ద్విచక్రవాహనాలపై జీఎస్‌టీ రేటును 18%కి తగ్గించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment