న్యూఢిల్లీ: తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన (హోల్‌సేల్) వాహనాల సంఖ్య 2024లో 11.6 శాతం పెరిగి 2,54,98,763 యూనిట్లకు చేరుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని సియామ్ తెలిపింది.
2023లో హోల్‌సేల్‌గా అమ్ముడైన మొత్తం వాహనాల సంఖ్య 2,28,39,130 యూనిట్లు. ‘2024 ఆటో పరిశ్రమకు సహేతుకంగా మంచిదే. వినియోగదారుల సానుకూల సెంటిమెంట్, దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం అన్ని వాహన విభాగాలలో వృద్ధిని అందించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వ స్థిర విధాన పర్యావరణ వ్యవస్థ కొన్నేళ్లుగా కొనసాగడం 2024లో పరిశ్రమకు కలిసి వచ్చింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ద్వారా సానుకూల సెంటిమెంట్‌తో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఊపు 2025లో వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.
విభాగాలవారీగా ఇలా..
ద్విచక్ర వాహన విభాగం హోల్‌సేల్‌లో గత ఏడాది 14.5 శాతం దూసుకెళ్లి 1,95,43,093 యూనిట్లు నమోదైంది. స్కూటర్స్ విక్రయాలు 20 శాతం అధికమై 66,75,231 యూనిట్లు, మోటార్‌సైకిల్స్ 12 శాతం ఎగసి 1,23,52,712 యూనిట్లకు చేరుకున్నాయి.
ప్యాసింజర్ వెహికిల్స్ 4 శాతం ఎగసి 43 లక్షల యూనిట్లు, త్రీవీలర్స్ 7 శాతం పెరిగి 7.3 లక్షల యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్ ఒక ఏడాదిలో ఈ స్థాయిలో హోల్‌సేల్ అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య వాహనాల విక్రయాలు 3 శాతం క్షీణించి 9.5 లక్షల యూనిట్లకు చేరాయి.
ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment