హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్‌లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్‌లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్‌లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్‌లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.
వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్‌ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్‌ఏడీఏ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment