రికవరీ బాటలో వాహన మార్కెట్
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జోరుగా ఉన్నాయి. వాహన మార్కెట్ రికవరీ బాట పట్టిందని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోట, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల దేశీయ విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో కూడిన మొత్తం అమ్మకాలు కొన్ని కంపెనీలవి మినహా పుంజుకున్నాయి.
కొత్త మోడళ్లు, పండుగల సీజన్ ప్రారంభం కావడం, తదితర అంశాలు దీనికి కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి రికవరీకి ఇంకా సమయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకోగలవని నిపుణులంటున్నారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసేవాళ్లు, ఎక్స్ఛేంజ్ విధానంలో కార్లను కొనుగోలు చేసేవాళ్లు పెరుగుతున్నారని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.
మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 10 శాతం పెరగ్గా, ఎగుమతులు 28 శాతం చొప్పున తగ్గాయి.
హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 15 శాతం పెరగ్గా, ఎగుమతులు 21 శాతం తగ్గాయి.
జనరల్ మోటార్స్ అమ్మకాలు 37 శాతం తగ్గాయి.
దేశీయ మార్కెట్లో టయోట అమ్మకాలు 4 శాతం పెరిగాయి.
నిస్సాన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తమ అమ్మకాలు 107 శాతం పెరిగాయని పేర్కొంది.
ఫోర్డ్ ఇండియా ఎగుమతులు రెట్టింపయ్యాయి.
టాటా మెటార్స్ ఎగుమతులు 18 శాతం పెరిగాయి.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా బైక్‌ల అమ్మకాలు 19 శాతం, స్కూటర్ల అమ్మకాలు 50 శాతం చొప్పున పెరిగాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ టూ-వీలర్ల అమ్మకాలు 29 శాతం, స్కూటర్ల అమ్మకాలు 63 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 18 శాతం, ఎగుమతులు 15 శాతం చొప్పున పెరిగాయి.
బజాజ్ ఆటో ఎగుమతులు 19 శాతం పెరిగాయి.