న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ మందగించడం ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది. గడిచిన రెండు–మూడు నెలల్లో సుమారు 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వివిధ రకాల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలు ఈ ఏడాది జూలైలో మొత్తం 18,25,148 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో వాహనాల అమ్మకాలు 22,45,223 యూనిట్లు. దేశీయంగా గతంలో 2000 డిసెంబర్‌లో చివరిసారిగా ఆటోమొబైల్ విక్రయాలు ఏకంగా 21.81 శాతం మేర పడిపోయాయి. ఆ తర్వాత ఇంత భారీ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రభుత్వం తక్షణం ప్యాకేజీ ప్రకటించాలి..
‘ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు పరిశ్రమ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా తన వంతుగా ఎంతో కొంత తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. సుమారు 15,000 మంది ఉద్యోగాలు (తాత్కాలిక, క్యాజువర్ వర్కర్లు) కోల్పోయారని ఆయన చెప్పారు. ఆటోమోటివ్ పరికరాల తయారీ రంగంలో మరో పది లక్షల మంది దాకా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. అమ్మకాలు పడిపోవడంతో సుమారు 300 డీలర్‌షిప్‌లు మూతబడ్డాయని మాథుర్ చెప్పారు. తయారీ జీడీపీలో ఆటోమొబైల్ పరిశ్రమ వాటా దాదాపు సగం ఉంటుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3.7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని మాథుర్ వివరించారు. ఈ పరిశ్రమ గానీ పతనమైతే జీడీపీ వృద్ధి కూడా మందగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలు వ్యయాన్ని తగ్గేలా, అమ్మకాలకు ఊతం లభించేలా కేంద్రం జీఎస్‌టీని తాత్కాలికంగానైనా తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నట్లు మాథుర్ చెప్పారు. వాహనాల స్క్రాపేజీ పాలసీ ప్రవేశపెట్టడం, రుణ లభ్యత పెంపు, వాహన రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదన వాయిదా తదితర విజ్ఞప్తులను ప్రభుత్వం ముందుంచినట్లు ఆయన వివరించారు.
పాసింజర్ వాహన విక్రయాలు 31% డౌన్..
n గతేడాది జూలైలో పాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు 2,90,031 యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది జూలైలో ఏకంగా 30% పడిపోయి 2,00,790 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది కూడా 19 ఏళ్లలో భారీ క్షీణత. వరుసగా 9 నెలల పాటు పీవీల అమ్మకాలు తగ్గినట్లయింది. చివరిసారిగా 2000 డిసెంబర్‌లో పీవీ అమ్మకాలు 35.22% పడిపోయాయి.
n ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే గత జూలైలో 1,91,979 కార్లు అమ్ముడవగా.. ఈ ఏడాది జూలైలో 36% క్షీణించి 1,22,956 యూనిట్లకు తగ్గాయి. 2000 డిసెంబర్‌లో ఈ క్షీణత 39.86 శాతం.
n ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 22.9 శాతం క్షీణించి 5,11,374 యూనిట్లకు తగ్గాయి. అటు పోటీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ విక్రయాలు కూడా సుమారు 11% తగ్గి 4,55,036 యూనిట్లకు, టీవీఎస్ మోటార్ అమ్మకాలు 16% క్షీణించి 2,08,489 యూనిట్లకు పరిమితమయ్యాయి.
n పీవీ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు జూలైలో సుమారు 37% క్షీణించి 96,478 యూనిట్లకు తగ్గాయి. హ్యుందాయ్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) 10 శాతం క్షీణతతో 39,010 యూనిట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా సుమారు 15% క్షీణతతో 16,830 యూనిట్లే విక్రయించగలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment