ముంబై: వాహన విక్రయాల్లో మార్చి నెలలో మొత్తంగా చూస్తే మంచి గణాంకాలే నమోదయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్ అమ్మకాలు దూసుకెళ్లగా... హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. అయితే టయోటా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం తగ్గాయి. ద్విచక్ర వాహన కంపెనీలైన టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి.
హ్యుందాయ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం విక్రయాలు 8.8 శాతం వృద్ధితో 60,507 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ గతేడాది మార్చిలో 55,614 యూనిట్లను విక్రయించింది. ఇక దేశీ విక్రయాలు 7.3 శాతం పెరిగాయి. ఇవి 44,757 యూనిట్ల నుంచి 48,009 యూనిట్లకు ఎగిశాయి.
టయోటా: టయోటా కిర్లోస్కర్ దేశీ విక్రయాలు 9.11% క్షీణతతో 12,539 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13,796 యూనిట్లుగా ఉన్నాయి.
ఫోర్డ్ ఇండియా: ఫోర్డ్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 11.06% వృద్ధి చెందాయి. 24,832 యూనిట్ల నుంచి 27,580 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ దేశీ అమ్మకాలు 9,016 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలోని 8,700 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 3.63 శాతం వృద్ధి కనిపించింది.
హోండా కార్స్: హోండా కార్స్ ఇండియా దేశీ విక్రయాల్లో ఏకంగా 28.36 శాతం క్షీణత నమోదయ్యింది. 13,574 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 18,950 యూనిట్లు రికార్డయ్యాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా: మొత్తం విక్రయాలు 10% వృద్ధి చెందాయి. ఇవి 56,202 యూనిట్ల నుంచి 62,077 యూనిట్లకు పెరిగాయి. దేశీ విక్రయాలు కూడా 10% వృద్ధితో 53,493 యూనిట్ల నుంచి 58,653 యూనిట్లకు చేరాయి.
మహీంద్రా ట్రాక్టర్: మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ విక్రయాలు 46.23% వృద్ధితో 28,277 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో 19,337 యూనిట్లను విక్రయించింది. దేశీ అమ్మకాలు 50% వృద్ధితో 17,973 యూనిట్ల నుంచి 26,958 యూనిట్లకు పెరిగాయి. 2017–18లో మొత్తం విక్రయాలు 20.68% పెరుగుదలతో 3,17,383 యూనిట్లకు చేరాయి.
అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధితో 15,277 యూనిట్ల నుంచి 17,057 యూనిట్లకు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విక్రయాలు 21 శాతం వృద్ధితో 1,74,873 యూనిట్లకు చేరాయి. 2016–17లో అమ్మకాలు 1,45,085 యూనిట్లుగా ఉన్నాయి.
ద్విచక్ర వాహన కంపెనీలు...
టీవీఎస్ మోటార్: టీవీఎస్ మోటార్ మొత్తం విక్రయాలు 27 శాతం వృద్ధితో 3,26,659 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 2,56,341 యూనిట్లను విక్రయించింది. మొత్తం టూవీలర్ అమ్మకాలు 25.8 శాతం ఎగిశాయి. ఇవి 2,50,979 యూనిట్ల నుంచి 3,15,765 యూనిట్లకు చేరాయి.
సుజుకీ మోటార్‌సైకిల్: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు 23.2% వృద్ధితో 51,858 యూనిట్లకు పెరిగాయి.
బజాజ్ ఆటో: బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 23 శాతం వృద్ధితో 2,72,197 యూనిట్ల నుంచి 3,34,348 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,69,279 యూనిట్ల నుంచి 2,03,600 యూనిట్లకు పెరిగాయి.
హెచ్‌ఎంఎస్‌ఐ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) విక్రయాలు 20.3 శాతం వృద్ధితో 4,40,499 యూనిట్లకు పెరిగాయి.
సొనాలికా లక్ష ట్రాక్టర్ల విక్రయం
సొనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ట్రాక్టర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 22% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 ఆర్థిక సంవత్సరంలో 50,853 ట్రాక్టర్లను విక్రయించామని.. 2018 క్యూ4లో 56 శాతం వృద్ధిని నమోదు చేశామని ఐటీఎల్ ఈడీ రామన్ మిట్టల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment