
మారుతి సుజుకీ లాభం 56% అప్
క్యూ1లో రూ. 1,193 కోట్లు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) ఏకంగా 56 శాతం పెరిగి రూ. 1,193 కోట్లుగా నమోదైంది. వాహన విక్రయాలు పెరగడం, విదేశీ మారక విలువలు సానుకూలంగా ఉండటంతో పాటు వ్యయ నియంత్రణ చర్యలు సత్పలితాలిస్తుండటం దీనికి దోహదపడినట్లు సంస్థ తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 762 కోట్లే. ఇక, తాజా క్యూ1లో అమ్మకాలు 18 శాతం వృద్ధి చెంది రూ. 11,074 కోట్ల నుంచి రూ. 13,078 కోట్లకు పెరిగాయి.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మారుతి సుజుకీ ఇండియా వాహన విక్రయాలు సుమారు 14 శాతం పెరిగి 3,41,329 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 2,99,894 వాహనాలను సంస్థ విక్రయించింది. దేశీయంగా అమ్మకాలు 13 శాతం వృద్ధి చెందాయి. 2,70,643 యూనిట్ల నుంచి 3,05,694 యూనిట్లకు పెరిగాయి. బీఎస్‌ఈలో మంగళవారం సంస్థ షేరు సుమారు అర శాతం పెరిగి రూ. 4,196 వద్ద ముగిసింది.