న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వాటి ఫిబ్రవరి నెల దేశీ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని ప్రకటించాయి. బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్ వంటి టూవీలర్ కంపెనీల వాహన అమ్మకాల్లోనూ బలమైన వృద్ధి కనిపించింది.
►మారుతీ దేశీ వాహన అమ్మకాలు 14.2 శాతం వృద్ధితో 1,37,900 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ మొత్తం వాహన అమ్మకాలు 15 శాతం వృద్ధితో 1,30,280 యూనిట్ల నుంచి 1,49,824 యూనిట్లకు చేరాయి.
►మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ విక్రయాలు 20 శాతం పెరుగుదలతో 40,526 యూనిట్ల నుంచి 48,473 యూనిట్లకు చేరాయి.
►వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాల్లోని బలమైన విక్రయాల కారణంగా టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 38 శాతం వృద్ధి చెందాయి. ఇవి 58,993 యూనిట్లుగా నమోదయ్యాయి. టియాగో, టిగోర్, నెక్సాన్, హెక్జా వంటి కొత్త ప్రొడక్టుల డిమాండ్ వల్ల 45 శాతం వృద్ధిని సాధించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 45 శాతం వృద్ధితో 12,272 యూనిట్ల నుంచి 17,771 యూనిట్లకు పెరిగాయి.
►ఫోర్డ్ ఇండియా మొత్తం విక్రయాలు స్వల్పంగా తగ్గి 23,965 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అయితే దేశీ విక్రయాలు మాత్రం 8.43 శాతం వృద్ధితో 8,338 యూనిట్ల నుంచి 9,041 యూనిట్లకు పెరిగాయి.
►టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ఇవి 11,864 యూనిట్లుగా నమోదయ్యాయి.
వాణిజ్య వాహన విక్రయాల జోరు
వాణిజ్య వాహన విక్రయాలకు వస్తే.. హిందూజా గ్రూప్ అశోక లేలాండ్ మొత్తం విక్రయాలు 29 శాతం పెరిగాయి. ఇవి 18,181 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే మహీంద్రా వాణిజ్య వాహన అమ్మకాలు 28 శాతం వృద్ధితో 16,383 యూనిట్ల నుంచి 20,946 యూనిట్లకు పెరిగాయి. ‘స్థిరమైన డిమాండ్ కారణంగా అటు పర్సనల్, ఇటు కమర్షియల్ రెండు వాహన విభాగాల్లోనూ మంచి విక్రయాలను సాధించగలిగాం. ఇదే ట్రెండ్ మార్చిలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా తెలిపారు. టాటా మోటార్స్ దేశీ వాణిజ్య వాహన విక్రయాలు 36 % వృద్ధితో 30,407 యూనిట్ల నుంచి 41,222 యూనిట్లకు పెరిగాయి.
టూవీలర్ రయ్..రయ్..
టూవీలర్ వాహన విభాగంలోనూ బలమైన వృద్ధి నమోదయ్యింది. బజాజ్ ఆటో మొత్తం విక్రయాలు 31 శాతం వృద్ధితో 2,73,513 యూనిట్ల నుంచి 3,57,883 యూనిట్లకు పెరిగాయి. దేశీ అమ్మకాలు 35 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,59,109 యూనిట్ల నుంచి 2,14,023 యూనిట్లకు పెరిగాయి. ఐషర్ మోటార్స్‌కు చెందిన టూవీలర్ విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం విక్రయాలు 25 శాతం వృద్ధితో 73,077 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 58,439 యూనిట్లను విక్రయించింది.
రెనో డస్టర్ ధర తగ్గింది..
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో ఇండియా’ తాజాగా తన ఎస్‌యూవీ ‘డస్టర్’ ధరను తగ్గించింది. ధర తగ్గింపు రూ.29,746– రూ.1,00,761 శ్రేణిలో ఉంటుందని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో ఇప్పుడు డస్టర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.95 లక్షలు నుంచి ప్రారంభమౌతోంది. ఇక దీని గరిష్ట ధర రూ.9.95 లక్షలుగా ఉంది. కాగా ఇదివరకు పెట్రోల్ వేరియంట్ ధర శ్రేణి రూ.8.5 లక్షలు– రూ.10.24 లక్షలుగా ఉంది. డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని ప్రస్తుత ధర రూ.8.95 లక్షలు– 12.79 లక్షల మధ్యలో ఉంది. ఇదివరకు ఈ వేరియంట్ ధర శ్రేణి రూ.9.45 లక్షలు–13.79 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌వి.
ఫిబ్రవరిలో కారు జోరు
Published Fri, Mar 2 2018 5:32 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment