న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్‌లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన అమ్మకాలు.. పండుగల సీజన్ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్‌లో మారుతీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధిని నమోదుచేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ కాలంలో మారుతీ విక్రయాలు 17% తగ్గగా.. గత నెల్లో మాత్రం 2.4% వృద్ధిని ప్రదర్శించాయి. మహీంద్రా అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైంది.
కొత్త ఏడాదిలో బీఎస్–6 వాహనాల విడుదలపై దృష్టిసారించామని, అధునాతన వాహనాల విడుదలతో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం లిమిటెడ్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను విడుదలచేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోనున్నామని, ఇన్వెంటరీని తగ్గించే చర్యలను ఇప్పటికే కొనసాగిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ వెల్లడించారు. ఇక గతనెల అమ్మకాలు తాము ఆశించిన స్థాయిలోనే ఉన్నట్లు హోండా కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ అన్నారు. నెమ్మదించిన ఆటో రంగంలో కనీసం గతేడాది చివర్లో అయినా అమ్మకాలు మెరుగుపడడం ఆశాజనకంగా ఉందని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment