హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్‌యూవీలు ఉండనున్నాయి.
దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మెర్సిడెస్‌తో బోణీ..
ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్‌ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్‌ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది.
మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్‌యూవీ టైసర్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్‌లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్‌వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి.
ఈవీలు సైతం మార్కెట్లోకి..
ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్‌లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్‌లో రానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment