హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్‌ఎస్ ఈవీకి భారీ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి.
ఎంజీ మోటార్ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది.
హలోల్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment