వాహన విక్రయాల్లో ఫోక్స్‌వ్యాగన్ నంబర్‌వన్
{పథమార్ధంలో 50.4 లక్షల వాహనాల విక్రయం
రెండో స్థానానికి టయోటా
టోక్యో : అంతర్జాతీయంగా అత్యధికంగా వాహనాల విక్రయాల్లో టయోటాను వెనక్కి తోసి ఫోక్స్‌వ్యాగన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యలో జపాన్ సంస్థ టయోటా 50.2 లక్షల వాహనాలు అమ్మగా, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ 50.4 లక్షల వాహనాలు విక్రయించింది. 48.6 లక్షల విక్రయాలతో జనరల్ మోటార్స్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దాదాపు దశాబ్ద కాలం అగ్రస్థానంలో కొనసాగిన జనరల్ మోటార్స్‌ను తోసిరాజని 2008లో టయోటా నంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకుంది. కానీ 2011లో జపాన్‌లో భూకంపం, సునామీల తాకి డికి ఉత్పత్తి పడిపోవడం తదితర పరిణామాల కారణంగా స్థానాన్ని కోల్పోయింది.
ఆ తర్వాత ఏడాది నుంచి మళ్లీ నంబర్‌వన్‌గా నిలుస్తూ వస్తోంది. అయితే, ప్రస్తుతం వాహనాల్లో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వివాదాలు చుట్టుముట్టడం, జపాన్‌లో పరిస్థితులు అంత మెరుగ్గా లేకపోవడం తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చని టయోటా అంచనా వేస్తోంది. 2014లో 1.02 కోట్ల వాహనాలు విక్రయించిన టయోటా ఈ ఏడాది 1.01 కోట్లకు పరిమితం కావొచ్చని భావిస్తోంది.