ఫ్యాన్సీ..నో క్రేజీ! | Fancy no crazy! | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ..నో క్రేజీ!

Published Tue, Feb 7 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

ఫ్యాన్సీ..నో క్రేజీ!

ఫ్యాన్సీ..నో క్రేజీ!

లక్కీ నెంబర్లపై తగ్గిన మోజు
40 శాతం తగ్గిన ఆర్టీఏ ఆదాయం
ఆల్‌ నైన్స్‌ నెంబర్‌కు..గతేడాది రూ.10 లక్షలు..ఈసారి రూ.2.35 లక్షలే..
‘అదృష్టానికి’ అడ్డంకిగా పెద్ద నోట్ల రద్దు
తగ్గిన హై ఎండ్‌ వాహనాల అమ్మకాలు


సిటీబ్యూరో :  9, 1, 999, 9999, 786, 6,666, 1111 ..... ఇలాంటి  ఫ్యాన్సీ, లక్కీ నెంబర్లపై వాహనదారులకు ఉండే క్రేజ్‌ మాటల్లో  చెప్పలేం. పెద్దఎత్తున పోటీకి దిగుతారు. వేలంలో  రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవుతారు. ఆ సీరీస్‌లో కోరుకున్న నెంబర్‌ రాలేదంటే మరో సీరీస్‌ కోసం ఎదురు చూస్తారు. ఏడాదైనా సరే నచ్చిన నెంబర్‌ చేతికి వచ్చేదాకా ఆగుతారు. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. గత రెండు నెలలుగా ఫ్యాన్సీ నెంబర్లపై ఆసక్తి తగ్గింది. రూ.లక్షలు వెచ్చించేందుకు వాహన యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. నెంబర్‌లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు సాహసించడం లేదు. దీంతో రవాణాశాఖ ఆదాయంపై  కూడా గణనీయమైన ప్రభావం పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాహనాల నెంబర్‌లపైన వచ్చే ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు అంచనా. సంపన్న వర్గాలు ఎక్కువ కొనుగోలు చేసే హై ఎండ్‌ వాహనాల అమ్మకాలు కూడా తగ్గడం ఇందుకు మరో కారణం.

అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా...
∙గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో  ఖైరతాబాద్‌  కేంద్ర కార్యాలయంలో  నిర్వహించిన  వేలం పాటల్లో  ‘టీఎస్‌ 09 ఈఎల్‌ 9999’ అనే నెంబర్‌ కోసం సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.10.50 లక్షలు. సోమవారం నిర్వహించిన వేలం పాటల్లో అదే నెంబర్‌ ‘టీఎస్‌ 09 ఈఆర్‌ 9999’ కోసం ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వేలంలో చెల్లించిన మొత్తం కేవలం రూ.2.35 లక్షలు.

► ఒక్క ఖైరతాబాద్‌లోనే కాదు. అత్తాపూర్, మలక్‌పేట్, సికింద్రాబాద్‌ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో గతేడాది ఇలాంటి నెంబర్‌ల కోసం వాహనదారులు రూ.5 లక్షల నుంచి  రూ.6 లక్షల వరకు చెల్లించారు. కానీ ఇప్పుడు  డిమాండ్‌ బాగా పడిపోయింది. గత సంవత్సరం రూ.15 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే నెంబర్‌ల సీరీస్‌పై రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చేది. తాజాగా నిర్వహించిన వేలం పాటల్లో  రూ.11.66 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. మొత్తంగా ఈ ఏడాది కాలంలో వాహనాల ఫ్యాన్సీ నెంబర్‌లపైన ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. అదృష్ట సంఖ్యలు, రైజింగ్‌ నెంబర్‌లపై ఇష్టం ఉన్నా...వేలంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.

‘హైఎండ్‌’ అమ్మకాలు కూడా తగ్గుముఖం...
ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విక్రయాలు జరిగే బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి వంటి  ఖరీదైన కార్ల అమ్మకాలు ఈసారి సగానికి సగం పడిపోయాయి. స్పోర్ట్స్‌ బైక్‌లు కూడా తగ్గాయి. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు ఏడాది చివరి రోజులు కావడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హై ఎండ్‌  మాత్రమే కాకుండా మధ్యతరగతి, వేతన  జీవులు కొనుగోలు చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ వంటి వాహనాల అమ్మకాలు కూడా  తగ్గాయి. నగరంలోని అన్ని ఆటోమోబైల్‌  షోరూమ్‌లలో ప్రతి నెలా సుమారు 25 వేల నుంచి  27 వేల వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. నోట్ల రద్దు కారణంగా ఈ సంఖ్య ఏకంగా 15 వేలకు పడిపోయింది.  వీటిలో హై ఎండ్, మధ్యతరగతి వర్గాలు విరివిగా కొనుగోలు చేసే వాహనాలే  ఎక్కువగా ఉన్నాయి. సాధారణ  వినియోగదారులు కొనుగోలు చేసే బైక్‌ల అమ్మకాలు మాత్రం పెద్దగా తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం.  ఇలా వాహన విక్రయాలు తగ్గడం కూడా ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్‌లపైన ప్రతికూల ప్రభావం చూపింది.

హోదా కోసం...
అదృష్ట సంఖ్యలుగా  భావించే  నెంబర్‌ల  కోసం కొందరు  పోటీకి దిగితే,  సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్‌ల కోసం పోటీ పడుతున్నారు.
► ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరీస్‌ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్‌లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్‌లు ఉంటాయి. ఈ నెంబర్‌ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. గతంలో ఒక  నెంబర్‌ కోసం సగటున 10 మంది పోటీ పడితే ఇప్పుడు ఆ సంఖ్య 6 కు పడిపోయింది. సోమవారం నిర్వహించిన వేలంలో పలికిన ధరలు ఇలా...
► టీఎస్‌ 09 ఈఆర్‌ 9999 –  రూ.2.35 లక్షలు
► టీఎస్‌ 09 ఈఎస్‌ 0007 – రూ.1.47 లక్షలు
► టీఎస్‌09 ఈఎస్‌ 005 – రూ.1.35 లక్షలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement