కార్ల విక్రయాలకు పండుగ కళ..
రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్
న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు..,
కొత్త మోడళ్లు, కొత్త వేరియంట్లతో మంచి అమ్మకాలు సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది. పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు బావుంటాయనే ఉద్దేశంతో తమ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని, తమ కంపెనీ చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అక్టోబర్‌లో అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.
గ్రాండ్ ఐ10 కూడా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించిందని వివరించారు. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రీమియం బ్రాండ్స్ క్రెటా, ఇలీట్ ఐ20/యాక్టివ్ కార్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు.
ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన టీయూవీ300 ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. వడ్డీరేట్లు తగ్గడం, ఇంధన ధరలు కూడా తక్కువ స్థాయిల్లోనే కొనసాగడం కలసివచ్చాయని వివరించారు.రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.