
మిశ్రమంగా వాహన విక్రయాలు
వాహన విక్రయాలు ఆగస్టు నెలలో మిశ్రమంగా ఉన్నాయి...
- వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలతో కొనుగోళ్లు వాయిదా..!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఆగస్టు నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ అమ్మకాలు వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా విక్రయాలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నెల... హ్యుందాయ్ కంపెనీకి అత్యధిక అమ్మకాలు సాధించిన నెలగా నిలిచింది. ఇక టూవీలర్ల విక్రయాల్లో హోండా, యమహా, రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు వృద్ధి సాధించాయి. కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
వివరాలు..,
- కొత్త ఎస్‌యూవీ క్రెటా, ఎలీట్ ఐ20, ఐ20 యాక్టివ్ కార్ల జోరుతో హ్యుందాయ్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. కంపెనీ చరిత్రలోనే ఇవి అత్యధికం.
- కొత్త మోడళ్ల కారణంగానే అమ్మకాలు పుంజుకున్నాయని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకోగలవని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు.