సాక్షి, అమరావతి: గత ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగాయి. సాధారణంగా రోజుకు 3,000 నుంచి 3,500 వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. కానీ, ఆ ఒక్క రోజు మాత్రం మొత్తం 13,034 వాహనాలు అమ్ముడయ్యాయి. కొత్త ఏడాది జనవరి 1 నుంచి రవాణేతర వాహనాలపై జీవిత పన్ను పెరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కువమంది ఆ రోజు వాహనాలు కొనుగోలు చేశారని, దీంతో రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు జరిగినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆ రోజున రాష్ట్రంలోని 738 వాహన డీలర్ల నుంచి ఏకంగా 13,034 వాహన విక్రయాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా మోటారు సైకిళ్లు 10,529.. 1,742 కార్లు అమ్ముడయ్యాయి. అలాగే, ఆ ఒక్కరోజే త్రైమాసిక పన్ను, జీవిత పన్ను రూపంలో రవాణా శాఖకు రూ.32.53 కోట్ల ఆదాయం వచ్చింది.
జీవిత పన్ను పెంపు
ఇక జనవరి 1 నుంచి ఐదు లక్షల రూపాయల్లోపు రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. అలాగే, రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల్లోపు ఉన్న రవాణేతర వాహనాలపై జీవిత పన్ను 12 శాతం నుంచి 14 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల్లోపు వాహనాలపై 17 శాతం, రూ.20 లక్షలు పైనున్న రవాణేతర వాహనాలపై 18 శాతం మేర జీవిత పన్ను అమల్లోకి వచ్చింది. ఈ కారణంతోనే మొన్న డిసెంబర్ 31న భారీఎత్తున మోటార్ సైకిళ్లు, కార్లు కొనుగోలు చేశారని రవాణా శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment