హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన డీలర్ల వద్ద అమ్మకాల్లో 10–15 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. పండుగల సీజన్, కొత్త మోడళ్లు ఇందుకు కారణమని వివరించింది. అలాగే కొన్నాళ్లుగా వాయిదా వేస్తున్న కస్టమర్లు ఇప్పుడు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారని తెలిపింది. ద్విచక్ర, ప్రయాణికులు, వాణిజ్య వాహనాల విక్రయంలో ఉన్న 123 మంది డీలర్లు సర్వేలో పాలుపంచుకున్నారు.
డీలర్ సెంటిమెంట్, అంచనాలను అంచనా వేయడం, గత సంవత్సరం నిర్వహించిన పోల్ ఫలితాలతో పోల్చడం లక్ష్యంగా ఈ సర్వే సాగింది. ‘కోవిడ్ –19 థర్డ్ వేవ్, ఇంధన ధరల పెరుగుదల, పరికరాల తయారీదారుల నుంచి సరఫరా పరిమితులతో ఈ రంగం మందగించే అవకాశం ఉంది. ఆటోమొబైల్ డీలర్ల పనితీరు ప్రాంతాన్నిబట్టి మారుతుంది. ఉత్తర భారతదేశంలో డీలర్‌షిప్‌లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 2020–21లో పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుదలను చూసింది. కానీ అది నిలబెట్టుకోలేదు. ద్విచక్ర వాహన డీలర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెగ్మెంట్లలో అమ్మకాలు ఇంకా మహమ్మారికి ముందు స్థాయికి చేరుకోలేదు’ అని క్రిసిల్ వివరించింది.
రాబోయే పండగ సీజన్‌లో..
వినియోగదార్లు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. డీలర్లలో సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ రాబోయే పండగ సీజన్‌లో మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తోందని క్రిసిల్ డైరెక్టర్ భూషణ్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ‘గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రాంతీయ పనితీరు వైవిధ్యాన్ని చూపుతుందని సర్వే వెల్లడించింది. ప్రయాణికులు, వాణిజ్య వాహన డీలర్లు అన్ని ప్రాంతాలలో అమ్మకాలు మెరుగుపడతాయని ఆశిస్తుండగా.. ఉత్తరాదిలో 44 శాతం ప్రయాణికుల వాహన డీలర్లు, దక్షిణాదిలో 40 శాతం వాణిజ్య వాహన డీలర్లు క్షీణత ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో సర్వే చేసిన వాణిజ్య వాహన డీలర్లలో ఉత్తరాదిలో 45 శాతం, పశ్చిమ ప్రాంతంలో 67 శాతం మంది విక్రయాలు 20 శాతం క్షీణించాయి.
ద్విచక్ర వాహన డీలర్లు ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకాలపై ఆశాజనకంగా ఉన్నారు. 2020–21లో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో సర్వే చేసిన దాదాపు 60 శాతం ద్విచక్ర వాహన డీలర్లలో 20 శాతం పైగా అమ్మకాలు క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన సిబ్బంది హేతుబద్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు డీలర్ల ఆర్థికాలపై ప్రభావాన్ని తగ్గించాయి. 2021–22లో డీలర్‌షిప్‌లను తీసివేయడంగానీ, సిబ్బంది కొరత వంటివి ఉండకపోవచ్చని అత్యధిక మంది డీలర్లు అభిప్రాయపడ్డారు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment